అమలాపురం టౌన్: ప్రపంచంలో ఏ దేశ నాణేలైనా గుండ్రంగా లేదా నలుపలకలుగా ఉంటాయి. అయితే సమోవా దేశం విడుదల చేసిన నాణేలు మాత్రం సీతాకోక చిలుక రెక్కల ఆకృతిలో కనువిందు చేస్తున్నాయి. వీటిని అమలాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ సేకరించారు. ప్రపంచంలోనే తొలిసారిగా సీతాకోక చిలుక రెక్కల ఆకృతిలో ముద్రించిన నాణేలు ఇవేనని కామేశ్వర్ తెలిపారు. 20 సెంట్లు ముఖ విలువ గల ఈ నాణేలు వెండి పూతతో రాగితో తయారయ్యాయి. ఒక్కొక్క నాణెంపై చైనా దేశపు ఒక్కొక్క రాశి చక్రాన్ని ముద్రించారు. చైనా దేశపు రాశి చక్రాల అధిపతులైన కుక్క, డ్రాగన్, మేక, గుర్రం, కోతి, ఎద్దు, పంది, కుందేలు, ఎలుక, కోడిపుంజు, పాము, పులి చిత్రాలు నాణేలపై ముద్రించారు.
చింత చిగురు కేజీ రూ.900
ఐ.పోలవరం: చింత చిగురుకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. కోనసీమ జిల్లాలోనే కేజీ రూ.850 నుంచి రూ.900 వరకూ పలుకుతోంది. అమలాపురం, రామచంద్రపురం, అంబాజీపేట, మురమళ్ల, కొత్తపేటల్లోని వారపు సంతాల్లో సైతం చింతాకు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. స్థానికంగా చింత చెట్టు ఎక్కి కొమ్మ చివరన ఉండే చింత చిగురు సేకరించేవారు తగ్గిపోయారు. ఇదే సమయంలో హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవ్వడం వల్ల కూడా స్థానికంగా ధర పెరగడానికి కారణమని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. అనేక శాకాహార, మాంసాహార వంటలకు మరింత రుచి కావడానికి చింత చిగురు వాడతారు.
ప్రేమ పేరుతో యువకుడి మోసం
ముమ్మిడివరం: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, బీఎస్‌ఎన్ కేసులు నమోదు చేసినట్లు ఎస్సై డి.జ్వాలా సాగర్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ముమ్మిడివరం మండలం గాడిలంకకు చెందిన ఒక యువతిని ఐ.పోలవరం మండలం పశువుల్లంకకు చెందిన చింతా సురేష్ రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. తీరా పెళ్లి చేసుకోమంటే తన ఇంట్లో ఒప్పుకోవడం లేదని ముఖం చాటేశారు. దీంతో యువతి ఫిర్యాదు మేరకు ముమ్మిడివరం పోలీసులు కేసు నమోదు చేశారు. అమలాపురం డీఎస్సీ టీఎస్‌కే ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్సై డి.జ్వాలా సాగర్ దర్యాప్తు చేస్తున్నారు.
సీతాకోక చిలుక రెక్కల ఆకృతిలో నాణేలు