
పాలిసెట్‌లో ‘తిరుమల’ విద్యార్థుల సత్తా
రాజమహేంద్రవరం రూరల్: పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాలలో రాజమహేంద్రవరంలోని తిరుమల విద్యార్థులు సత్తా చాటారు. వరుణ్ తేజ్, ఆకుల నిరంజన్ శ్రీరామ్, బల్లా రిషిత శ్రీస్వప్న, రూపిటి చహ్నా అనే నలుగురు విద్యార్థులు 120 మార్కులకు 120 మార్కులు సాధించారు. ఆ విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు మాట్లాడుతూ 9 మంది విద్యార్థులు 119 మార్కులతో ప్రతిభ చూపారన్నారు. స్టేట్ 5, 7, 10, 11వ ర్యాంకులకు కై వసం చేసుకున్నామన్నారు. అలాగే 50 లోపు 9 మంది, 100 లోపు 16 మంది, 500 లోపు 57 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారన్నారు. ఆ విద్యార్థులను తిరుమల విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్ బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు.
రైలు ఢీకొని వ్యక్తి మృతి
తుని: తుని–హంసవరం మధ్యలోని బాలయోగి మెట్ట సమీపంలో పట్టాలు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తి.. రైలు ఢీకొని మృతి చెందాడని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం అందిన సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించామన్నారు. మృతుడి వయసు సుమారు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. అతడి వద్ద ఎరుపు, తెలుపు రంగు టవల్ ఉందని, కుడి చేతిపై శ్రీరాములు అనే పచ్చబొట్టు ఉందన్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.