
బాలుడి మృతదేహం లభ్యం
ప్రత్తిపాడు: పెద శంకర్లపూడి గ్రామ సమీపంలోని ఏలేరు ఎడమ కాలువలో గల్లంతైన పంది వీర వెంకట సత్యనారాయణ (విఘ్నేష్) (15) మృతదేహం బుధవారం లభ్యమైంది. కాలువలో స్నానానికి దిగి మంగళవారం సాయంత్రం విఘ్నేష్ గల్లంతైన విషయం విధితమే. రాత్రి వరకు గజ ఈతగాళ్లతో గాలించినా ఫలితం లేకపోవడంతో బుధవారం ఉదయం తిరిగి ఏలేరు కాలువలో గాలింపు చేపట్టారు. అయితే విఘ్నేష్ కాలువలో దిగిన ప్రాంతంలోనే నీటి అడుగున బురదలో చిక్కుకుని మృతి చెందాడు. మృతదేహాన్ని గజఈతగాళ్ల వెలికి తీశారు. అనంతరం ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. మృతుడి తండ్రి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ప్రత్తిపాడు సీఐ బి.సూర్యఅప్పారావు తెలిపారు. కాగా.. విఘ్నేష్ లంపకలోవ జెడ్పీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి పూర్తి చేశాడు. తన సోదరుడు, స్నేహితులతో కలిసి కాలువలో ఈతకు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. కాకినాడ సిరిని స్థానికులు కాపాడగలిగారు. కానీ విఘ్నేష్ నీటి అడుగున బురదలో చిక్కుకుని మృతి చెందాడు.