
పెనకనమెట్ట సావరంలో చోరీ
తాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు మండలంలోని పెనకనమెట్ట సావరంలో ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. కొవ్వూరు రూరల్ సీఐ బి.విజయబాబు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నాగిరెడ్డి సత్తిబాబు, వారి కుటుంబ సభ్యుల తో పాటు ఈ నెల 11వ తేదీన పందలపర్రులో బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్లారు. 12వ తేదీ ఉదయం తిరిగి వచ్చి చూసుకుని సరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. దుండగులు ఇంట్లో బీరువా తాళాలు పగులగొట్టి సుమారు 8 కాసుల బంగారు వస్తువులను, రూ.8 లక్షల నగదు, 250 గ్రాముల బరువు గల వెండి వస్తువులను దొంగిలించినట్టుగా తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని ఇన్‌చార్జి డీఎస్పీ కేవీ సత్యనారాయణ, క్లూస్ టీం ఇన్‌స్పెక్టర్ స్వరూప్, సీఐ శ్రీధర్ తదితరులు పరిశీలించి, వివరాలు సేకరించారు.
పక్కింటికి భోజనానికి వెళ్లి వచ్చేలోగా దోచేశారు
రాజానగరం: ఇంటి తలుపులకు గడియపెట్టి, పక్కింటికి వెళ్లి భోజనం చేసి వచ్చేలోగానే ఇంట్లో దాచుకున్న బంగారు నగలను దుండగులు అపహరించుకుపోయారు. మండలంలోని వెలుగుబందలో మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి. జాలెం గోపీరత్నం పక్కింటి వారి ఆహ్వానంపై భోజనం చేసి వచ్చేందుకు ఇంటి తలుపులకు గడియపెట్టి వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి ఆ తలుపులు తెరచివుండటంతో కంగారుగా లోనికి వెళ్లి చూస్తే ఇంట్లో దాచుకున్న నాలుగు కాసుల బంగారు నగలు కనిపించలేదు. వెంటనే రాజానగరం వచ్చి, జరిగిన చోరీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.
ఘరానా దొంగ అరెస్టు
బనశంకరి: బెంగళూరులో చోరీలకు పాల్పడుతున్న ఏపీలోని తూర్పు గోదావరికి చెందిన ఘరానా దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల నగరంలో కొడిగేహళ్లిలో ఇంటి తాళం బద్దలు కొట్టి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దోచుకెళ్లారు. పోలీసులు గాలించి జేబీ నగరలో నివసించే గోదావరి వాసి కామేపల్లి శ్రీనివాస్ అలియాస్ కార్తీక్ (39)ను అరెస్ట్‌చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.9.20 లక్షల విలువచేసే 148 గ్రాముల బంగారు ఆభరణాలు, 200 గ్రాముల వెండి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గత నెల 16వ తేదీన చోరీ చేసిన తరువాత ఓ ప్రైవేటు హాస్టల్‌లో మకాం వేశాడు. పోలీసులు సీసీ కెమెరాల చిత్రాలు, ఇతర ఆధారాల ప్రకారం పట్టుకున్నారు. కార్తీక్‌కు దొంగతనాలే వృత్తి అని, బీదర్, హైదరాబాద్, సైబరాబాద్‌తో పాటు 10 పోలీస్ స్టేషన్లలో పాత నేరస్తుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. కార్తీక్, మోహన్‌రుద్ర అనే పేర్లతో తిరుగుతూ చోరీలకు పాల్పడేవాడు. ఇతడిపై ల్యాప్‌టాప్, ఇళ్లలో చోరీలతో పాటు 88 కి పైగా కేసులు ఉన్నట్లు చెప్పారు.