
కనుల విందుగా.. విరుల పండుగ..
జైలు నుంచి విడుదలైన నేరస్తులపై ప్రత్యేక నిఘా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వివిధ నేరాలపై జైలుకు వచ్చి, శిక్ష అనంతరం విడుదలైన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ సూచించారు. ఆస్తి నేరాలపై ఆయన మంగళవారం జిల్లా పోలీసు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రైమ్ ప్రోన్, ఐసోలేటెడ్ ఏరియాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, రాత్రి సమయాలలో ప్రత్యేక గస్తీ నిర్వహించాలన్నారు. అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులను ఫింగర్ ప్రింట్ డివైసెస్, ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా చెక్ చేయాలన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్టీ నేరాలపై ప్రత్యేక చొరవ చూపాలన్నారు. రాత్రి వేళల్లో ఆస్తి నేరాలను అరికట్టేందుకు స్పెషల్ పార్టీలు, క్రైమ్ టీమ్‌లు అప్రమత్తంగా తిరగాలన్నారు. విజిబుల్ పోలీసింగ్, రాత్రి గస్తీ మరింత పటిష్టం చేయాలన్నారు.
పకడ్బందీగా
సప్లిమెంటరీ పరీక్షలు
రాజమహేంద్రవరం సిటీ: ఈ నెల 19 నుంచి 28 వరకూ జరిగే పదో తరగతి, ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) టి.సీతారామ్మూర్తి తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణపై తన చాంబర్‌లో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 28 కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకూ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. వీటికి రెగ్యులర్ 3,167, ప్రైవేటు 686 మంది కలిపి మొత్తం 3,853 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ఓపెన్ స్కూల్ పదో తరగతి విద్యార్థులు 589 మందికి 6, ఇంటర్ విద్యార్థులు 771 మందికి 4 చొప్పున పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలూ సంబంధిత శాఖల అధికారులు చేపట్టాలని కోరారు. సమావేశంలో డీఈఓ కె.వాసుదేవరావు, విద్యా శాఖ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీకుమారి, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గోదావరి డెల్టా సిస్టం
సీఈగా శ్రీరామకృష్ణ
ధవళేశ్వరం: గోదావరి డెల్టా సిస్టం సీఈగా ఆర్.శ్రీరామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ హైడ్రాలజీ ప్రాజెక్ట్ ఎస్‌ఈగా ఉన్న ఆయన ఇప్పటికే గోదావరి డెల్టా సిస్టం సీఈగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పదోన్నతిపై ఇప్పుడు పూర్తి స్థాయి సీఈగా నియమితులయ్యారు.
అన్నవరం: వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం రాత్రి సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి శ్రీపుష్పయాగ మహోత్సవం స్వామివారి నిత్య కల్యాణ మండపంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఒకవైపు నిండుగా అలంకరించిన సుగందభరిత పుష్పమాలికలు.. మరోవైపు రంగురంగుల విద్యుద్దీప తోరణాలతో మెరిసిపోతున్న కల్యాణ మండపంలో.. నూతన పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, సుగంధభరిత పుష్పమాలలు ధరించి వేదికపై కల్యాణ శోభతో ప్రకాశిస్తున్న స్వామి, అమ్మవార్ల శ్రీపుష్పయాగ మహోత్సవాన్ని వేలాది మంది భక్తులు దర్శించి, తన్మయత్వం చెందారు. పెళ్లి పెద్దలు సీతారాములు వెంట రాగా, నవదంపతులు సత్యదేవుడు, అమ్మవార్లను కల్యాణ మండపానికి ఊరేగింపుగా రాత్రి ఏడు గంటలకు తీసుకువచ్చారు. వెండి సింహాసనంపై స్వామి అమ్మవార్లను, పక్కనే మరో ఆసనంపై సీతారాముల మూర్తులను ఉంచి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, పండితులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం గావించి, గర్భాదాన కార్యక్రమానికి సంబంధించిన పూజలు నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవార్లకు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి, వేదాశీస్సులు అందజేసిన అనంతరం సర్వాంగసుందరంగా అలంకరించిన ఊయల మీద విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అలంకరణలో సత్యదేవుడు, అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో పూజించారు. తొమ్మిది రకాల పిండివంటలు నివేదించారు. పండితుల మంత్రోచ్చారణల నడుమ ఊయలను మూడు పర్యాయాలు ఊపారు. ఊయల ఎదురుగా ఉంచిన అద్దంలో స్వామి, అమ్మవార్ల ప్రతిబింబాలను తిలకించి భక్తులు పులకించారు. తరువాత దంపత తాంబూలాలు, ప్రసాదాలు అందించారు. వైదిక కార్యక్రమాలను వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, చిట్టి శివ, యనమండ్ర శర్మ, గంగాధరభట్ల గంగబాబు, ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకులు ఇంద్రగంటి వేంకటేశ్వర్లు, కంచిభట్ల రామ్‌కుమార్, సుధీర్, దత్తాత్రేయశర్మ, వైదిక కార్యక్రమాల పర్యవేక్షకుడు నాగాభట్ల కామేశ్వరశర్మ, వైదిక కమిటీ సభ్యుడు, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్ తదితరులు నిర్వహించారు. కార్యక్రమానికి వేలాదిగా వచ్చిన మహిళలకు జాకెట్టు ముక్కలు పంపిణీ చేశారు. శ్రీపుష్పయాగంతో సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి.
ఘనంగా సత్యదేవుని శ్రీపుష్పయాగం
భారీగా తరలి వచ్చిన భక్తులు

కనుల విందుగా.. విరుల పండుగ..

కనుల విందుగా.. విరుల పండుగ..

కనుల విందుగా.. విరుల పండుగ..

కనుల విందుగా.. విరుల పండుగ..