
రైతుల పాలిట పగాకు
కోలుకోవడం కష్టం
కూటమి పాలనలో రైతులకు అన్నీ కష్టాలే. పంటకు గిట్టుబాటు ధర లేదు. పెట్టుబడులు రాని పరిస్థితి. పొగాకు ధరలు మరీ దారుణంగా ఉన్నాయి. పెట్టుబడులు పెరిగాయి. కూలీల సమస్య ఎక్కువగా ఉంది. ఎకరాకు రూ.2.50 లక్షల పెట్టుబడి, కౌలు అవుతోంది. ఎకరాకు సగటున 10 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ప్రస్తుత ధర ప్రకారం ఎకరాకు రూ.2.30 లక్షలు మాత్రమే ఆదాయం వస్తోంది. అంటే ఎకరాకు సుమారు రూ.20 నుంచి రూ.40 వేల వరకూ నష్టం వస్తోంది. నేను 50 ఎకరాల్లో పొగాకు సాగు చేస్తున్నా. గిట్టుబాటు ధర రాకపోతే రైతులు, కౌలు రైతులు కోలుకోవడం చాలా కష్టం. పొగాకు మార్కెట్ సంక్షోభంలో ఉన్నప్పుడు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి, రైతులను ఆదుకొంది. కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు.
– వల్లభనేని సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం, వెదుళ్లకుంట, గోపాలపురం మండలం
దేవరపల్లి: పొగాకు సాగు రైతుల పాలిట పగాకుగా మారింది. ధర దారుణంగా పడిపోయింది. గత ఏడాది కిలో పొగాకు ధర గరిష్టంగా రూ.410 పలకడంతో రైతులకు ఊహించని లాభాలు వచ్చాయి. దీంతో, ఈ ఏడాది భూముల కౌలు, బ్యారన్ల అద్దెలకు రెక్కలొచ్చాయి. అయినప్పటికీ నిబంధనలు పక్కన పెట్టి మరీ రైతులు అధిక విస్తీర్ణంలో పంట సాగు చేశారు. ప్రస్తుత పంట కాలంలో పొగాకు కొనుగోళ్లు మార్చి 24న ప్రారంభించారు. ప్రారంభ ధర కిలోకు గరిష్టంగా రూ.290 పలికింది. కొనుగోళ్లు ప్రారంభించి మంగళవారానికి 51 రోజులైంది. మొత్తం 38 రోజుల పాటు వేలం జరిగింది.
నిరాశలో రైతులు
రోజులు గడుస్తున్నా ధరలో పెరుగుదల, కొనుగోళ్లు ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. నాణ్యమైన పొగాకుకు కూడా కిలోకు గరిష్టంగా రూ.260 నుంచి రూ.290 వరకూ మాత్రమే ప్రస్తుతం లభిస్తోంది. ధరలు పెరగకపోవడంతో రైతులు వేలం కేంద్రాలకు బేళ్లు తక్కువగా తెస్తున్నారు. లో గ్రేడ్ పొగాకు కొనుగోలుకు కంపెనీలు నిరాకరిస్తున్నాయి. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు ప్రతికూల వాతావరణం, సాగుకు అధిక పెట్టుబడులు, వీటన్నింటికీ మించి కూలీల సమస్య.. వెరసి పొగాకు రైతులు దిక్కు తోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. రూ.లక్షల పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్నా సరైన ధర రాక నష్టాలు చవి చూడాల్సి వస్తోందని అంటున్నారు. కనీసం కౌలు డబ్బులు, పెట్టుబడి వస్తే చాలని దీనంగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు పొగాకు ప్రధాన ఎగుమతి సంస్థలైన ఐటీసీ, జీపీఐ, పీఎస్‌ఎస్, డక్కన్, అలయన్స్ వంటి కంపెనీలకు ఇంత వరకూ ఎగుమతి ఆర్డర్లు ఖరారు కాలేదు. దీంతో ఆయా కంపెనీలు ఇంకా వేలం కేంద్రాలకు రాకపోవడంతో కొనుగోళ్లు కూడా మందకొడిగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఐటీసీ ఎక్కువ శాతం పొగాకు కొనుగోలు చేస్తోంది. ఈ నెల 20 తర్వాత ఆర్డర్లు ఖరారవుతాయని, అనంతరం ప్రధాన కంపెనీలు వేలం కేంద్రాలకు వస్తాయని తెలుస్తోంది.
పెరిగిన సాగు ఖర్చులు
గత ఏడాదితో పోల్చుకుంటే పొగాకు సాగు ఖర్చులు 20 నుంచి 25 శాతం వరకూ పెరిగాయి. ఎకరం భూమికి కౌలు రూ.70 వేలు, బ్యారన్ అద్దె రూ.1.60 లక్షలకు తీసుకుని మరీ పంట వేశారు. అన్నీ కలిపి ఎకరాకు సుమారు రూ.2.50 లక్షల పెట్టుబడి పెట్టారు. తీరా మార్కెట్ పరిస్థితి చూస్తే కనీసం పెట్టుబడి కూడా వచ్చేలా లేదని కౌలు రైతులు ఆవేదన చెందుతున్నారు. పొగాకు సాగు చేస్తున్న రైతుల్లో 80 శాతం కౌలుదారులే ఉన్నారు.
రూ.253.64 కోట్ల పొగాకు విక్రయం
పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో ఇప్పటి వరకూ రూ.253.64 కోట్ల విలువైన 9.19 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. రైతులు 71,096 బేళ్లు విక్రయించారు. వేలంలో 10 కంపెనీలు పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకూ కిలో గరిష్ట ధర రూ.290, కనిష్ట ధర రూ.220, సగటు ధర రూ.276.18 చొప్పున లభించాయి.
ఉత్పత్తి అంచనా 80 మిలియన్ల కిలోలు
ప్రస్తుత పంట కాలంలో ఐదు వేలం కేంద్రాల పరిధిలో 59 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పతికి బోర్డు అనుమతి ఇచ్చింది. అయితే, క్యూరింగ్‌ల ప్రారంభంలో 70 మిలియన్ల కిలోలు ఉత్పత్తి అవుతుందని బోర్డు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రస్తుతం క్యూరింగ్‌లు ముగింపు దశకు చేరడంతో 80 మిలియన్ల కిలోల వరకూ ఉత్పత్తి వస్తుందని అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, కొనుగోలు సంస్థల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. మొత్తం 14,754 మంది రైతులు 12,723 బ్యారన్లు రిజిస్ట్రేషన్ చేయించుకోగా సుమారు 29,450 హెక్టార్లలో పొగాకు సాగు చేసినట్టు అధికారికంగా లెక్కలు వేశారు. అయితే రిజిస్ట్రేషన్లు లేకుండా మరో 10 వేల హెక్టార్లలో రైతులు సాగు చేసినట్లు అంచనా. ఈ ఏడాది బ్రెజిల్, జింబాబ్వే దేశాల్లో పంట ఉత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశమున్నందున పరిమితికి మంచి పొగాకు సాగు వద్దని, ఉత్పత్తి పెరిగితే నష్టపోతారని ముందు నుంచీ అధికారులు రైతులకు చెబుతూనే వచ్చారు. వేలం కేంద్రాల వారీగా సమావేశాలు పెట్టి పంట నియంత్రణపై సూచనలు చేశారు. కానీ, రైతులు ఈ సూచనలను బేఖాతరు చేసి, సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచారు. బాడవ భూముల్లో సైతం సాగు చేశారు. ఈ పొగాకు కొనుగోలుకు కంపెనీలు నిరాకరిస్తూండటంతో లబోదిబోమంటున్నారు.
కొనుగోళ్లు ప్రారంభమై 51 రోజులు
ఖరారు కాని ఎగుమతి ఆర్డర్లు
వేలం కేంద్రాలకు రాని ప్రధాన కంపెనీలు
పెరగని పొగాకు ధర
పెట్టుబడి కూడా దక్కదేమోనని
రైతుల ఆందోళన
గిట్టుబాటు ధర ఇప్పించాలి
మార్కెట్ పరిస్థితి అర్థం కావడం లేదు. సాగు ఖర్చులు కూడా వస్తాయో లేదో తెలియని పరిస్థితి. కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. గిట్టుబాటు ధర లేక వేలానికి బేళ్లు తీసుకురావడం లేదు. లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయడం లేదు. ఐదో రెలుపు నుంచి పొగాకు కొనుగోలు చేస్తున్నారు. పీఎస్‌ఎస్, డక్కన్, జీపీఐ కంపెనీలు మార్కెట్‌కు వస్తే ధర పెరుగుతుందనే ఆశతో రైతులున్నారు. ఇప్పటికై నా ట్రేడర్లతో అధికారులు చర్చించి, గిట్టుబాటు ధర ఇప్పించి, రైతులను ఆదుకోవాలి.
– కరుటూరి శ్రీనివాస్, అధ్యక్షుడు, పొగాకు రైతు సంఘం, సంగాయగూడెం, దేవరపల్లి మండలం
రైతుల పరిస్థితి దయనీయం
గిట్టుబాటు ధర రాక పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. కంపెనీలు పూర్తి స్థాయిలో వేలంలో పాల్గొనకపోవడంతో మార్కెట్లో కొనుగోలుదారుల మధ్య పోటీ లేదు. ముందు ముందు మంచి ధర వస్తుందనే ఆశతో ఉన్నాం. సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెరగడం వల్ల మార్కెట్ సంక్షోభంలో ఉంది. ఇందులో రైతుల తప్పిదం కూడా ఉంది.
– పిన్నమనేని మధుమోహన్, పొగాకు రైతు సంఘం ప్రతినిధి, చిన్నాయగూడెం, దేవరపల్లి మండలం

రైతుల పాలిట పగాకు

రైతుల పాలిట పగాకు

రైతుల పాలిట పగాకు