
ఆగని టీడీపీ నాయకుల దుశ్చర్యలు
గోకవరం: జగ్గంపేట, గోకవరం మండలాల సరిహద్దున ఉన్న సింగారమ్మ చింత ఆలయ అర్చకురాలు వట్టికూటి సీతామహాలక్ష్మి ఇంటిని మల్లిసా లకు చెందిన టీడీపీ నాయకులు గత నెలలో కూల గొట్టారు. అక్కడితో ఆగని వారు.. ఆ ఇంటి అవశేషాలకు సైతం నిప్పు పెట్టి బూడిద చేశారు. తాము మంగళవారం ఆలయం వద్దకు వచ్చేసరికి ఇంటికి సంబంధించిన కర్రలతో పాటు సామగ్రి మొత్తం బూడిదైందని బాధితులు వాపోయారు. తమను శాశ్వతంగా వెళ్లగొట్టేందుకే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్నారు. ఈ దుర్మార్గాన్ని నిరసిస్తూ బాధితులతో కలిసి సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకులు గోకవరం తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ ఎదుట ప్రదర్శన నిర్వహించారు. తహ సీల్దార్ సాయిప్రసాద్, ఎస్సై పవన్‌కుమార్‌లకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జున్‌రావు మాట్లాడుతూ, సింగారమ్మ చింత అమ్మవారి ఆలయం వద్ద వంశపారంపర్యంగా అర్చకత్వాన్ని కొనసాగిస్తూ, అక్కడే చిన్నపాటి దుకాణం నిర్వహిస్తూ జీవిస్తున్న సీతామహాలక్ష్మిపై మల్లిసాలకు చెందిన టీడీపీ నాయకులు, కమిటీ సభ్యు లు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాత్రికి రాత్రే దుకాణాన్ని దౌర్జన్యంగా ధ్వంసం చేయడంతో పాటు సింగారమ్మ అమ్మవారి నగలు, ఇతర విలువైన వస్తువులు పట్టుకుపోయారన్నారు. కూల్చివేసిన పాకతో పాటు ఇతర సామగ్రికి నిప్పంటించారని అన్నారు. బాధితులకు న్యాయం చేయకుంటే ఈ నెల 22 నుంచి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.