నిడదవోలు రూరల్: కుటుంబ కలహాలు, భర్త వేధింపులు తాళలేక ఉరి వేసుకుని ప్రైవేటు స్కూల్ టీచర్ మృతిచెందినట్లు సమిశ్రగూడెం ఎస్సై కె.వీరబాబు సోమవారం తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం నిడదవోలు మండలం తాడిమళ్లకు చెందిన పంతగాని విమలకుమారి (40) తిమ్మరాజుపాలెంలో ఒక ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త వెంకట శ్రీను విజయవాడలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
2015లో వివాహమైన వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలంగా భార్యాభర్తలు పలు విషయాల్లో గొడవ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి బంధువులు ఇంటికి వివాహానికి వెళ్లే సమయంలో వివాదం తలెత్తింది. దీంతో విమలకుమారి ఇంటి పైపోర్షన్‌లో ఉన్న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వీరబాబు పేర్కొన్నారు.