త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
సామర్లకోట: స్థానిక పిఠాపురం రోడ్డులో కొదండరామపురం వద్ద సోమవారం కారు అదుపు తప్పి విద్యుత్తు స్తంభాన్ని ఢీ కొంది. విద్యుత్తు స్తంభం విరిగి కారుపై పడింది. దాంతో ఆ రోడ్డులో రాకపోకలు చేస్తున్నవారు పరుగులు తీశారు. పిఠాపురం వైపు నుంచి సామర్లకోట వైపు వస్తున్న కారు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు ముందు భాగం నుజ్జునజ్జు అయింది. కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి వెంటనే కారు నుంచి దిగి పోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారంతో అధికారులు విద్యుత్తు సరఫరాను నిలిపి వేశారు. కారు నడుపుతున్న వ్యక్తి సూరంపాలెంలోని ఒక యూనివర్సిటీలో ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నట్లు తెలిసింది.
పంట చేలోకి వెళ్లిన కారు
పెరవలి: అదుపు తప్పిన కారు పంట చేలోకి వెళ్లటంతో పాటు కొబ్బరి చెట్టును ఢీకొట్టి ఆగింది. పెరవలి మండలం వడలి– ముక్కామల ఆర్‌అండ్‌బీ రహదారిలో సోమవారం తెల్లవారు జాము జరిగిన ఈ ప్రమాదంలో చిన్ని చిన్న గాయాలతో బయటపడ్డారు. ఏ ఊరు వారో తెలియదు కానీ మద్యం మత్తులో కారు వేగంగా వచ్చిందని, అదుపు తప్పిన కారు ముందుగా ఎలక్ట్రికల్ స్తంభాన్ని రాసుకుంటూ వెళ్లి చేలో ఉన్న కొబ్బరి చెట్టును ఢీకొట్టి ఆగిందని స్థానికులు చెప్పారు. ఆ సమయంలో పెద్ద శబ్దం రావటంతో పరుగున వచ్చినా కారులో ఉన్నవారు వెళ్లిపోయారని తెలిపారు. అదే పగలు జరిగి ఉంటే పెను ప్రమాదం జరిగేదని రాత్రి అవ్వటం వలన జన సంచారం లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.

విద్యుత్తు స్తంభాన్ని ఢీ కొన్న కారు