
కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు కరవు
● ఎవరి దగ్గర మార్కుల కోసం
పోలీసుల తాపత్రయం?
● ఎల్లకాలం ఒకరే అధికారంలో
ఉండరన్న విషయం గమనించాలి
● దుర్మార్గాలకు మూల్యం తప్పదు
● వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా
రాజమహేంద్రవరం సిటీ: అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, జానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. కక్షసాధింపు చర్యలు మితిమీరిపోయాయని, ఈ ప్రభుత్వంలో శాంతిభద్రతలు దారుణంగా తయారయ్యాయని మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని తన నివాసంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత విడుదల రజని విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు శోచనీయమన్నారు. ఫిర్యాదు నమోదు కూడా చేయకుండానే అనుకున్నదే తడవుగా ఎక్కడుంటే అక్కడకు వెళ్లి వాళ్లను లాక్కుని పోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి మెప్పు కోసం, ఎవరి దగ్గర మార్కులు కొట్టేయడానికి ఇలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై పోలీసు వ్యవస్థ కూడా ప్రశ్నించుకోవాలని, ఎల్లకాలం ఒక్కరే అధికారంలో ఉండరని, ప్రతిసారీ ఇదే ప్రభుత్వం రాదని, ప్రతిసారీ ఇదే వ్యక్తి సీఎం స్థానంలో కూర్చోరని, ప్రతి రోజూ ఇదే రకంగా ఉండదనే విషయాన్ని రాష్ట్రంలోని ప్రతి పోలీసు అధికారీ గ్రహించాలని అన్నారు. మాజీ మంత్రి విడదల రజని, ఆమె పీఏ పరామర్శకు వెళ్లారని, పీఏను పోలీసులు తీసుకునిపోవడం, దీనిపై అడిగితే రజనీపై పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులను ఈవిధంగా వాడుకోవడం కూటమి ప్రభుత్వానికి తగదని హితవు పలికారు. సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చి ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ఇస్తామని చెప్పి పంగనామాలు పెట్టారని ఆయన విమర్శించారు.
హామీలు అమలు చేయకుండా ఇష్టం వచ్చినట్లు విపక్ష నాయకులు, కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతూ, సమస్యను పక్కదారి పట్టించడానికి కూటమి ప్రభుత్వం కుయుక్తితో వ్యవహరిస్తోందని రాజా మండిపడ్డారు. శ్రీకాకుళం మొదలుకుని అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్ సీపీ శ్రేణులను అణచివేస్తూ, వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. మాజీ మంత్రి అని గానీ, ఒక మహిళ అని గానీ చూడకుండా రజనీ పట్ల సీఐ దౌర్జన్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. పోలీసు డ్రెస్ వేసుకుంటే సుప్రీం అయిపోయినట్లు ప్రవరించడం సిగ్గుచేటన్నారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే ప్రభుత్వ పెద్దలు, పోలీసులు చట్ట పరిధిలోనే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని గ్రహించాలన్నారు. ఇప్పుడు వ్యవహరిస్తున్న దుర్మార్గ చర్యలకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదనే విషయాన్ని కూటమి పెద్దలు, పోలీసులు గ్రహించాలని స్పష్టం చేశారు. ఈ అకృత్యాలకు కచ్చితంగా జవాబు చెప్పాల్సి వస్తుందనే విషయం మరచిపోవద్దని హెచ్చరించారు. ఇప్పటికే ప్రజలు విసిగిపోయి ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి తిరిగి పట్టడం కట్టడం ఖాయమని అన్నారు. ఇప్పటికైనా తప్పుడు కేసులు వెనక్కి తీసుకోవాలని, దాడులు, కక్ష సాధింపులు పక్కన పెట్టి, ఇచ్చిన హామీల అమలుపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని రాజా హితవు పలికారు.