
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం సిటీ): పాఠశాలల పునర్వ్యవస్థీకరణ, బదిలీలు, ప్రమోషన్ల నేపథ్యంలో తలెత్తుతున్న విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో ఉపాధ్యాయులు సోమవారం ధర్నా నిర్వహించారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.జయకర్, ఎ.షరీఫ్ నేతృత్వంలో డీఈఓ కార్యాలయం ఎదుట ఈ కార్యక్రమం చేపట్టారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.అరుణ కుమారి మాట్లాడుతూ, ప్రతి వారం గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమస్యలపై చర్చిస్తున్నప్పటికీ అధికారులు వాటిని ఖాతరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జయకర్ మాట్లాడుతూ, జీఓ నంబర్ 117 రద్దు చేస్తామని, పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆ హామీ అమలు చేయడం లేదని అన్నారు. షరీఫ్ మాట్లాడుతూ, హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్లను తగ్గించడం వల్ల విద్యా ప్రమాణాలు తీవ్రంగా పడిపోయే ప్రమాదం ఉందన్నారు. రానున్న రోజుల్లో జరగనున్న పదోన్నతులు, బదిలీ సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించాలన్నారు. లేకుంటే ఈ నెల 15న రాష్ట్ర కేంద్రంలో విద్యా భవన్‌ని వేలాది మంది ఉపాధ్యాయులతో ముట్టడిస్తామని హెచ్చరించారు. యూటీఎఫ్ ఉపాధ్యక్షురాలు కె.విజయగౌరి మాట్లాడుతూ, మోడల్ ప్రైమరీ స్కూళ్లతో పాటు బేసిక్ ప్రైమరీ స్కూళ్లు, బేసిక్ స్కూళ్లకు కూడా తగినంత ప్రాధాన్యం కల్పించాలన్నారు. అనంతరం జిల్లా విద్యా శాఖ అధికారి కె.వాసుదేవరావుకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కోశాధికారి ఈవీఎస్‌ఆర్ ప్రసాద్, కార్యదర్శులు ఇ.శ్రీమణి, సీహెచ్ దయానిధి, కె.రమేష్‌బాబు, చిలుకూరి శ్రీనివాసరావు, సీహెచ్‌వీ రమణ, మనోహర్, శ్రీనివాస్ మూర్తి, నర్సారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జె.రూపస్‌రావు తదితరులు పాల్గొన్నారు.