
కేంద్రం చేతిలోకి.. ఉపాధి స్టీరింగ్!
● కొత్తగా ‘యుక్తధార’ యాప్
● దీని ద్వారా ఏ ప్రాంతంలో ఎప్పుడు
పని చేయాలో నిర్దేశించనున్న కేంద్రం
● పథకాన్ని తన చెప్పుచేతల్లో
ఉంచుకునేందుకు ఎత్తుగడ
● రాష్ట్రాల హక్కులకు మంగళం
పాడే దిశగా సంస్కరణలు
సాక్షి, రాజమహేంద్రవరం: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టానికి కేంద్రం తూట్లు పొడుస్తోందా.. ఇప్పటి వరకూ రాష్ట్రాల అజమాయిషీలో ఉన్న ఈ పథకం నిర్వహణ పూర్తిగా కేంద్రం చేతికి వెళ్లనుందా.. ఇకపై పనుల కల్పన, అంచనాల ప్రక్రియను కేంద్రమే పర్యవేక్షించనుందా.. ఇందులో భాగంగానే నూతన మొబైల్ యాప్ తీసుకొచ్చిందా.. రాష్ట్ర ప్రభుత్వం పాత్ర నామమాత్రంగా మారనుందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది.
ఇదీ సంగతి
గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు 100 రోజుల ఉపాధికి గ్యారెంటీ కల్పించాలని, ఉన్న ఊళ్లోనే పనులు కల్పించాలనే డిమాండుతో దేశవ్యాప్తంగా ఎన్నో పోరాటాలు జరిగాయి. అనంతరం, అప్పటి యూపీఏ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నాంది పలికింది. దీనిపై 2005లో చట్టం రూపొందించింది. ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్ల ద్వారా పనులు కల్పించేలా చేసింది. ఏపీఓ, ఎంపీడీఓలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. పనుల కల్పన నుంచి, బిల్లుల చెల్లింపుల వరకూ అన్నీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే నడిచేలా చర్యలు తీసుకుంది. ఏదైనా గ్రామంలో కూలీలకు పనులు కల్పించాలంటే ఆయా గ్రామ పంచాయతీలు సామూహికంగా ఒక సంవత్సరంలో చేపట్టాల్సిన పనులను గుర్తించే వెసులుబాటు కల్పించారు. దీనినే సెల్ఫ్ ఆఫ్ వర్క్స్ అంటారు. దీనిని గ్రామ కార్యదర్శి నిర్వహించాలి. ఉపాధి హామీ చట్టం–2005 ప్రకారం గుర్తించిన పనులను గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ తీర్మానాల అనంతరం మంజూరు చేయాలి. ఇప్పటి వరకూ ఇదే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన యాప్‌తో ఇవన్నీ కనుమరుగుకానున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
యాప్‌తో ఏం చేస్తారంటే..
ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘యుక్తధార’ పేరిట సరికొత్త మొబైల్ యాప్ తీసుకొచ్చింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పనులను తన అజమాయిషీలో నిర్వహించేందుకు కేంద్రం సర్వం సిద్ధం చేసింది. ఏ రాష్ట్రంలో ఎలాంటి పనులు జరుగుతున్నాయి.. ఏ ప్రాంతంలో ఏ పని ఎప్పుడు పెట్టాలి.. అంచనాలు ఎలా వేయాలి.. బిల్లులు చెల్లింపులు ఎలా జరగాలనే అంశాలన్నింటినీ ఈ యాప్ ద్వారా ఢిల్లీలో కూర్చునే కేంద్ర ప్రభుత్వ అధికారులు నిర్ణయించే అవకాశం కలుగుతుంది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి అవసరమైన లేబర్ బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుంది. కూలీలు చేయాల్సిన పనులన్నీ కేంద్రమే గుర్తిస్తుంది. పనులు చేపట్టిన కూలీలకు కేంద్రమే నేరుగా బిల్లులు చెల్లిస్తుంది. యుక్తధార మొబైల్ యాప్ వినియోగం ఇప్పటికే ప్రారంభమైంది. తొలి దశలో జిల్లా వ్యాప్తంగా మండలానికో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అమలు చేస్తున్నారు. అనంతరం, రెండో దశలో జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ దీనిని అమల్లోకి తెస్తారు. నిడదవోలు మండలం శెట్టిపేటలో ప్రస్తుతం ఇదే పద్ధతిలో పనులు కల్పిస్తున్నారు.
రాష్ట్రాల హక్కులకు భంగం
యుక్తధార యాప్ వలన రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉపాధి పథకం నిధుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మురుగు కాలువలు, ఇతర భవన నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ యాప్ ద్వారా కేంద్ర పర్యవేక్షణ మొదలైతే భవిష్యత్తులో ఈ పనులన్నీ చేసే వీలుంటుందా.. ఈ పథకంలో పని చేస్తున్న ఉద్యోగులు ఎవరి పర్యవేక్షణలో విధులు నిర్వర్తించాలి.. రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, అవినీతి నిర్మూలనకే ఈ యాప్ తెచ్చామని కేంద్రం చెబుతోంది. అవినీతి నిర్మూలించాలంటే కఠిన నిబంధనలు తీసుకురావాలే తప్ప.. కేంద్రం ఆ ధీనంలోకి తీసుకోవడమేంటనే వాదన కూడా వినిపిస్తోంది. దీని వలన పనుల కల్పన తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ యాప్ వలన ఉపాధి హామీ పథకంపై రాష్ట్రాలు తమ హక్కులను కోల్పోతాయని, ఇది పూర్తిగా ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే చర్యనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిడదవోలు మండలంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు (ఫైల్)
జిల్లాలో ఉపాధి పథకం బ్లాకులు 18
పంచాయతీలు 300
మంజూరైన జాబ్‌కార్డులు 1.69 లక్షలు
కూలీలు 2.61 లక్షలు
యాక్టివ్ జాబ్‌కార్డులు 1.23 లక్షలు
పనులు వినియోగించుకుంటున్న కూలీలు 1.76 లక్షలు
ఒక్కో కూలీ సగటు వేతనం రూ.254
ఏటా కల్పిస్తున్న పని దినాలు 53 లక్షలు
వెచ్చిస్తున్న నిధులు సుమారు రూ.152 కోట్లు