● గింజల ధర నేల చూపులు
● గత ప్రభుత్వ హయాంలో కిలోకు రూ.1,050 ఆదాయం
● నేడు రూ.500కు పతనం
● కొనుగోలు సంస్థల సిండికేట్
● గిట్టుబాటు కాక, కొనే నాథుడు లేక రైతుల గగ్గోలు
పెరవలి: మార్కెట్లో ఒక సరకు సరఫరా తగ్గితే సహజంగానే దానికి డిమాండ్.. అందుకు అనుగుణంగా ధరలు పెరుగుతాయి. అర్ధశాస్త్రంలో ఇది ప్రాథమిక ఆర్థిక సూత్రం. ఇది ఎక్కడైనా చెల్లుతుందేమో కానీ.. రైతుల విషయంలో మాత్రం ఎప్పుడూ తల్లకిందులవుతూనే ఉంది. పొగాకు, నిమ్మ, వరి రైతులు ఇప్పటికే సరైన గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నారు. ఈ కోవలో కోకో రైతులు కూడా చేరారు. ఓవైపు గింజల దిగుబడి తగ్గింది. ఇటువంటి సమయంలో మార్కెట్‌లో వీటి ధర పెరగాలి. కానీ, గోరుచుట్టుపై రోకలి పోటులా కొనుగోలు సంస్థలు సిండికేట్ అయ్యి ముందుకు రాకపోవడంతో కోకో రైతులు గగ్గోలు పెడుతున్నారు.
16 వేల హెక్టార్లలో..
జిల్లా వ్యాప్తంగా సుమారు 5 వేల మంది రైతులు 16 వేల హెక్టార్లలో రైతులు కోకో సాగు చేస్తున్నారు. పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, చాగల్లు, దేవరపల్లి, కొవ్వూరు, కడియం, సీతానగరం, బిక్కవోలు తదితర మండలాల్లో కోకో సాగు జరుగుతోంది. ఒక్క నిడదవోలు నియోజకవర్గంలోనే 860 ఎకరాల్లో కోకో సాగు జరుగుతూండగా, దీనిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా సీజన్‌లో సుమారు 2.64 లక్షల క్వింటాళ్ల కోకో గింజల ఉత్పత్తి జరుగుతుంది.
రైతుల ఆశలపై నీళ్లు
సాధారణంగా ప్రతి పంట సీజన్‌లో ఎకరాకు నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కానీ, ఈ ఏడాది అది రెండు మూడు క్వింటాళ్లకు పడిపోయింది. ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్ ఏర్పడి, మార్కెట్లో మంచి ధర లభిస్తుందని రైతులు భావించారు. కానీ, ప్రైవేటు కొనుగోలు సంస్థలు సిండికేట్ అయ్యి, రైతుల ఆశలపై నీళ్లు జల్లారు. గత ఏడాది ఇదే సమయంలో కిలో కోకో గింజలకు రూ.1,050 చొప్పున ధర పలికింది. ఈసారి కూడా ధర ఆశాజనకంగా ఉంటుందని రైతులు ఆశ పడ్డారు. గింజలు ఫ్యాక్టరీలకు తీసుకెళ్తే కనీసం గేట్లు కూడా తీయటం లేదని, మార్కెట్ ధరకే అమ్ముతామన్నా వద్దంటున్నారని చెబుతున్నారు. కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాల్లో మామూళ్లు ఇస్తే కిలో గింజలకు రూ.500 మాత్రమే చెల్లిస్తున్నారని వాపోతున్నారు. ఎకరానికి పెట్టుబడి రూ.60 వేలు అవుతూండగా, ఇటు దిగుబడి, అటు ధర తగ్గిపోవడంతో నష్టాలు చవిచూడాల్సి వస్తోందని వాపోతున్నారు. దిగుబడి రెండు క్వింటాళ్లు మాత్రమే రావడంతో వచ్చిన సొమ్ము ఖర్చులకు సరిపోతోందని ఒక రైతు చెప్పారు. ఈ పరిస్థితుల్లో నష్టాన్ని తగ్గించుకునేందుకు చాలాచోట్ల రైతులే కాయలు కోసి, గింజలు తీసుకుంటున్నారు. దీనివలన తమకు పనులు లేకుండా పోయాయని కూలీలు ఆవేదన చెందుతున్నారు.
నష్టాలు చవిచూశా..
గత ఏడాది కంటే అధిక ధర పలుకుతుందని ఆశించాం. కానీ, తక్కువ ధర లభించింది. దిగుబడి కూడా తగ్గటంతో లాభాలు లేకపోగా రైతులు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. కిలో రూ.500 పలుకుతున్నా గత్యంతరం లేక అయినకాడికి అమ్ముకోవలసి వస్తోంది.
– కంటిపూడి సూర్యనారాయణ, రైతు, తీపర్రు
చాలా దారుణం
కొనుగోలు కంపెనీలు సిండ్‌కేట్‌గా మారి కోకో గింజల ధర తగ్గించాయి. నేడు రూ.500 ధరకు కూడా కొనే నాథుడు లేడు. కంపెనీకి తీసుకెళ్తే కనీసం గేట్లు కూడా తీయటం లేదు. ఇంత దారుణం ఎప్పుడూ లేదు.
– వాకలపూడి సూర్యారావు, రైతు, కానూరు
కోకో.. కోలుకోలేక..
కోకో.. కోలుకోలేక..
కోకో.. కోలుకోలేక..