
రథోత్సవంపై సూర్య ప్రతాపం
● జనం రాక కళ తప్పిన ఉత్సవం
● నూతన రథంపై సత్యదేవుడు,
అమ్మవారి ఊరేగింపు
అన్నవరం: సత్యదేవుని రథోత్సవంపై సూర్యుడు ప్రతాపం చూపించాడు. నిప్పుల వర్షం కురిసినట్టుగా ఎండ కాయడంతో ఆశించిన స్థాయిలో భక్తులు రాకపోవడంతో ఉత్సవం కళ తప్పింది. వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన ఆదివారం సాయంత్రం సత్యదేవుని రథోత్సవం నిర్వహించారు. ఎండ తీవ్రతకు తోడు సరైన ప్రణాళిక లేకపోవడంతో రథోత్సవం ప్రారంభ సమయానికి గ్రామస్తులు, భక్తులు పెద్దగా రాలేదు. గత ఏడాది సాయంత్రం 5 గంటలకు రథోత్సవం ప్రారంభమై రాత్రి 9.30 గంటల వరకూ కొనసాగగా, ఈసారి 4 గంటలకు మొదలై రాత్రి 7.30 గంటలకే ముగిసింది. గత ఏడాది రథోత్సవం సాయంత్రం 5 గంటలకు మొదలైంది. అప్పటికి ఎండ తగ్గడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఈసారి ఉత్సవం మొదలయ్యే సమయానికి 35 డిగ్రీల సెల్సియస్‌కు పైబడి ఉష్ణోగ్రత ఉండటంతో గ్రామస్తులు, భక్తులు పెద్దగా రాలేదు. వారితో పోలిస్తే దేవస్థానం సిబ్బంది, పోలీసులు, కళాకారులే అధికంగా కనిపించారు. ప్రారంభ సమయానికి 250 మంది దేవస్థానం సిబ్బంది, 150 మంది పోలీసులు, 200 మంది కళాకారులు మాత్రమే ఉన్నారు. సాయంత్రం 5.30 గంటల సమయానికి కాస్త ఎండ తగ్గడంతో గ్రామస్తులు వచ్చారు. ఉత్సవం ముగిసే సమయానికి సుమారు 3 వేల మంది మాత్రమే ఉన్నారు.
ఉత్సవం జరిగిందిలా..
సత్యరథాన్ని ఉదయం 8 గంటలకు పంపా సత్రం నుంచి రత్నగిరి తొలి పావంచా వద్దకు తీసుకువచ్చారు. సాయంత్రం 4 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అర్చకులు ఊరేగింపుగా తొలి పావంచా వద్దకు తీసుకువచ్చి, రథంపై వేంచేయించి, పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు రథం ముందు కుంభం పోసి, గుమ్మడికాయతో దిష్టి తీశారు. అనంతరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు రథోత్సవాన్ని ప్రారంభించారు. తొలి పావంచా నుంచి ఆంధ్రా బ్యాంక్ వరకూ, అక్కడి నుంచి తిరిగి తొలి పావంచా మీదుగా దేవస్థానం టోల్‌గేట్ వరకూ, అక్కడి నుంచి కొత్తగా నిర్మించిన రథం షెడ్డు మీదుగా తొలి పావంచా వరకూ రథోత్సవం సాగింది. అనంతరం, స్వామి, అమ్మవార్లను రథం నుంచి కిందకు దించి, ఊరేగింపుగా కొండపై ఆలయానికి చేర్చారు.