
ఆపరేషన్ సిందూర్ విజయవంతం హర్షణీయం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడం పట్ల మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ హర్షం వ్యక్తం చేశారు. భారతీయులందరూ సగర్వంగా కాలర్ ఎగరేసుకుని ఉండేలా నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, మన దేశ రక్షణ దళాలకు ఈ క్రెడిట్ దక్కుతుందని, వారికి సెల్యూట్ చేస్తున్నానని ఆయన అన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం స్థానిక కొత్తపేట రౌతు తాతాలు కల్యాణ మండపంలో జైన్ సేవా సమితి ఆధ్వర్యాన ఆదివారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో భరత్ పాల్గొని, స్వయంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తలసేమియా వ్యాధితో బాధ పడుతున్న పిల్లల కోసం జైన్ సేవా సమితి రాజమహేంద్రవరంతో పాటు దేశవ్యాప్తంగా చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ఈ వ్యాధి రాకుండా ఉండటానికి చేపట్టాల్సిన చర్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. వివాహాల సమయంలో తలసేమియాకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిదని సూచించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. జాగృతి బ్లడ్ బ్యాంకు, మాగ్నా ఆసుపత్రి సౌజన్యంతో ఈ రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించడంపై భరత్ అభిననందనలు తెలిపారు. కార్యక్రమంలో అశోక్ కుమార్ జైన్, విక్రమ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.