
కంచికి చేరుతున్న కోతలు
● జిల్లాలో 58,586 హెక్టార్లలో
రబీ వరి సాగు
● 57,946 హెక్టార్లలో కోతలు పూర్తి
● 5.26 లక్షల మెట్రిక్ టన్నుల
ధాన్యం ఉత్పత్తి
● మందకొడిగా కొనుగోళ్లు
● ఎక్కడి ధాన్యం అక్కడే..
● అన్నదాతలను హడలెత్తిస్తున్న
అకాల వర్షాలు
దేవరపల్లి: జిల్లాలో రబీ వరి కోతలు చివరి దశకు చేరుకున్నాయి. సీజన్ ప్రారంభంలో అధిక వర్షాలు కురవడంతో ఎక్కువ మంది రైతులు వరి నాట్లు ఆలస్యంగా వేశారు. బోర్ల కింద ముందుగా సాగు చేసిన పంట కోతలు సకాలంలో జరిగినప్పటికీ.. ఆలస్యంగా నాట్లు వేసిన చోట్ల కోతలు ఇంకా జరుగుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో రైతులు 58,586 హెక్టార్లలో రబీ వరి సాగు చేశారు. 4,520 హెక్టార్లలో ఫైన్ వైరెటీ, 46,204 హెక్టార్లలో కామన్ వైరెటీ, 5,154 హెక్టార్లలో పీఆర్–126 రకం వంగడాలను రైతులు పండించారు. ఇప్పటి వరకూ 57,946 హెక్టర్లలో (98 శాతం) వరి కోతలు పూర్తయ్యాయి. దీని ద్వారా 5,26,435 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగింది. మరో రెండు వారాల్లో కోతలు దాదాపు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.
దిగుబడులు ఆశాజనకం
రబీ వరి దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 50 నుంచి 60 బస్తాల వరకూ దిగుబడులు సాధించారు. సగటున ఎకరాకు 50 బస్తాలు తగ్గకుండా దిగుబడి వస్తోందని రైతులు చెబుతున్నారు. అయితే, మద్దతు ధర లభించడం లేదని వాపోతున్నారు. అరకొరగా సంచుల సరఫరా, తేమ శాతం నిబంధనలతో మిల్లర్లు ఇబ్బందులు పెట్టడం, ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో తెరవకపోవడంతో దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు పంటను అమ్ముకోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లుకు వెళ్లినా లోడు సకాలంలో దింపుకోక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం 75 కిలోల బస్తాకు రూ.1,750 మద్దతు ధర ప్రకటించింది. కానీ, దళారులు రూ.1,250 నుంచి రూ.1,350కి కొనుగోలు చేయడంతో దారుణంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. యంత్రాలతో కోతలు కోసి రోడ్లపై ఆరబెట్టి ఎప్పటి ధాన్యం అప్పుడే అమ్ముకుంటున్నారు. వాతావరణం అనుకూలించక పోవడంతో ఎక్కువ మంది రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు పంటను అమ్ముకోవలసి వస్తోంది. పీఆర్–126 (బొండాలు) రకం ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు ముందుకు రావడం లేదని రైతులు చెబుతున్నారు.
అకాల వర్షాలతో టెన్షన్
రబీ వరి కోతల ప్రారంభం నుంచి ఈదురు గాలులతో అకాల వర్షాలు కురుస్తూండటంతో అన్నదాతలు టెన్షన్ పడుతున్నాడు. రాత్రి సమయంలో అకాల వర్షాలు కురుస్తూండటంతో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దవుతోందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికీ వేల బస్తాల ధాన్యం ఎక్కడికక్కడే రోడ్లపై ఉంది. దీంతో, కంటి మీద కునుకు లేకుండా ధాన్యం రాశుల వద్దే రైతులు పడిగాపులు పడుతూ, పంటను కాపాడుకుంటున్నారు. పగలంతా రోడ్లపై ఆరబెట్టిన ధాన్యాన్ని సాయంత్రం రాశులుగా వేసి బరకాలు కప్పి, ఒబ్బిడి చేసుకుంటున్నారు. చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ ధాన్యం రాశులతో నిండి ఉన్నాయి.
చివరి దశకు కోతలు
రబీ కోతలు చివరి దశకు చేరాయి. ఎప్పటి ధాన్యాన్ని అప్పుడే రైతులు తమకు నచ్చిన మిల్లుకు పంపిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. రైతులు 2 లక్షల టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే దళారులకు అమ్ముకున్నారు. మొత్తం 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
– ఎస్.మాధవరావు, జిల్లా వ్యవసాయ అధికారి, రాజమహేంద్రవరం

కంచికి చేరుతున్న కోతలు

కంచికి చేరుతున్న కోతలు