
అప్రోచ్ రోడ్లు, దీపాలు వేయించరా?
● ఎంతో పోరాడి మోరంపూడి
ఫ్లై ఓవర్ నిర్మించాం
● నాకు పేరు వస్తుందనే ఇక్కడ
పనులు ఆపేశారా?
● అవినీతి, అక్రమాల పైనే తప్ప
అభివృద్ధిపై దృష్టి పెట్టరేం?
● మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ సూటి ప్రశ్న
● ఫ్లై ఓవర్ వద్ద గోతులు పూడ్చి, నిరసన
రాజమహేంద్రవరం రూరల్: తాను ఎంతో పోరాడి, త్రికరణ శుద్ధితో మోరంపూడి ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేయిస్తే, కనీసం అప్రోచ్ రోడ్లు, లైట్లు వేయించాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేకపోవడం దారుణమని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ విమర్శించారు. మోరంపూడి ఫ్లై ఓవర్ వద్ద వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలసి ఆయన శనివారం నిరసన తెలిపారు. అక్కడి గోతులను మట్టితో పూడ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జాతీయ రహదారిపై కీలక జంక్షన్‌గా ఉన్న మోరంపూడి సెంటర్‌లో వేలాది ప్రమాదాలు జరిగి, వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. దీనిని నివారించేందుకే పట్టుబట్టి ఇక్కడ ఫ్లై ఓవర్ సాధించామని చెప్పారు. తాము కట్టించిన ఫ్లై ఓవర్‌కు రిబ్బన్ కత్తిరించడం మినహా కూటమి ప్రభుత్వం అప్రోచ్ రోడ్డు, లైట్లు, సర్వీస్ రోడ్ల వంటి ఎలాంటి సౌకర్యాలూ కల్పించలేదని అన్నారు. గోదావరిలో ఇసుక, రాజమహేంద్రవరంలో భూములు దోచుకోవడం, లిక్కర్ మాఫియాతో అడ్డగోలు సంపాదన పైనే ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఆత్రుత పడుతున్నారని ఆరోపించారు. రాజమహేంద్రవరం నగరంలో పేకాట క్లబ్బులు, గాంబ్లింగ్, స్పా సెంటర్ల వంటివి ఎమ్మెల్యే మనుషులే పెట్టుకుని ఇక్కడి సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నారని భరత్ విమర్శించారు. వీటన్నింటిపై ఉన్న శ్రద్ధ నిర్మాణం పూర్తయి, ప్రారంభించి ఏడాది అయిన ఫ్లై ఓవర్‌కు అప్రోచ్ రోడ్లు వేయించడంపై ఎందుకు లేదని నిలదీశారు. ఒకవైపు ప్యాచ్ వర్కులు చేస్తున్నారని, వాళ్లనే ఇక్కడకు తీసుకుని వచ్చి, కనీసం ఆ పనులైనా చేయించవచ్చు కదా అని అన్నారు. ప్యాచ్ వర్కులు కూడా చేయకపోవడంతో వాహనదారుల నడుములు విరిగిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మోరంపూడి ఫ్లై ఓవర్ వలన తనకు మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతో అప్రోచ్ రోడ్లు, లైట్లు వేయించకుండా తాత్సారం చేస్తున్నారా అని భరత్‌రామ్ అనుమానం వ్యక్తం చేశారు. చిన్న ప్యాచ్ వర్కులు కూడా చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే చేతకానివాడేనని, అందుకే ప్రభుత్వం మేల్కొని అప్రోచ్ రోడ్లు, లైట్లు వేయించాలని డిమాండ్ చేశారు. బంగ్లా నుంచి నిత్యం ఇదే రోడ్డులో కలెక్టరేట్‌కు వెళ్తున్న కలెక్టరైనా స్పందించాలి కదా అని ప్రశ్నించారు. ఫ్లై ఓవర్ మీది నుంచి వెళ్లిపోవడంలో అప్రోచ్ రోడ్ల బాధ తెలియడం లేదేమోనని అన్నారు. తగిన శ్రద్ధ తీసుకుని, ఈ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. నేషనల్ హైవే సంస్థ వలన కాకపోతే మున్సిపల్ కార్పొరేషన్ అయినా ఈ పనులు చేపట్టాలని సూచించారు. కనీసం ఎంపీ పురందేశ్వరి అయినా దీనిపై దృష్టి పెట్టకపోతే ఎలాగని, కాంట్రాక్టర్‌తో చేయించాలని అన్నారు. ప్రజల బాధలు చూసి, డస్ట్, చిప్స్ రప్పించి ఇక్కడి గుంతల్లో ప్యాచ్ వర్కులు చేయిస్తున్నామని భరత్ అన్నారు.