
ప్రతిధ్వనించిన వేదఘోష
● సత్యదేవుని సన్నిధిలో
ఘనంగా పండిత సదస్యం
● 150 మంది పండితులకు సత్కారం
అన్నవరం: రత్నగిరి వేద ఘోషతో ప్రతిధ్వనించింది. సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల్లో భాగంగా నవ దంపతులు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల సమక్షంలో శనివారం వేద పండిత సదస్యం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం నలు మూలల నుంచీ విచ్చేసిన సుమారు 150 మంది వేద, స్మార్త పండితులు స్వామివారి ముందు తమ విద్వత్తును ప్రదర్శించారు. మధ్యాహ్నం 3 గంటలకు పెళ్లి పెద్దలు సీతారాములు వెంట రాగా స్వామి, అమ్మవార్లను అనివేటి మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి, అక్కడి వేదికపై వేంచేయించారు. స్వామి, అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు చేశారు. సాయంత్రం ఆరు గంటల వరకూ పండితుల వేద మంత్రఘోషతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది. ఈ సందర్భంగా వేద పండితులను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు ఘనంగా సత్కరించారు. సత్కారం పొందిన వారిలో మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి, గొల్లపల్లి దత్తాత్రేయ ఘనపాఠి (రాజమహేంద్రవరం), ఉపాధ్యాయుల కాశీపతి సోమయాజులు ఘనపాఠి (తిరుపతి), ఉపాధ్యాయుల లక్ష్మీనృసింహ ఘనపాఠి (విజయవాడ దుర్గమ్మ దేవస్థానం), దువ్వూరి ఫణియజ్ఞ ఘనపాఠి, విష్ణుభట్ల లక్ష్మీనారాయణ ఘనపాఠి (తిరుపతి వేద విశ్వవిద్యాలయం), అన్నవరం దేవస్థానం వేద పండితులు ఉన్నారు.
ఘనంగా పొన్నచెట్టు వాహన సేవ
సత్యదేవుడు, అమ్మవారిని రాత్రి పొన్నచెట్టు వాహనం మీద ఘనంగా ఊరేగించారు. రాత్రి 9 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా కొండ దిగువన తొలి పావంచా వద్దకు తీసుకువచి, పొన్నచెట్టు వాహనంపై వేంచేయించి, పూజలు చేశారు. అక్కడి నుంచి ఆంధ్రా బ్యాంక్ సెంటర్‌కు వెళ్లి, తిరిగి తొలి పావంచా వరకూ ఊరేగింపు సాగింది.