
నేడు సత్యదేవుని రథోత్సవం
భారీ టేకు రథంపై ఊరేగనున్న స్వామి, అమ్మవార్లు
తొలి పావంచా నుంచి ప్రారంభం కానున్న వైనం
అన్ని ఏర్పాట్లు చేసిన దేవస్థానం అధికారులు
అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో భాగంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన స్వామివారి రథోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. 36 అడుగుల ఎత్తయిన నూతన టేకు రథంపై స్వామి, అమ్మవార్లను కొండ దిగువన గల మెయిన్ రోడ్డులో ఊరేగిస్తారు. సాయంత్రం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ వైభవంగా ఈ కార్యక్రమం జరపనున్నారు. ఈ మేరకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
కార్యక్రమ వివరాలు ఇవే..
● సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో భాగంగా స్వామి, అమ్మవార్లను ఊరేగించేందుకు రూ.1,04 కోట్లతో 36 అడుగుల ఎత్తు, 14.6 అడుగుల వెడల్పు, 21 అడుగుల పొడవు గల భారీ రథాన్ని తయారు చేశారు. ఇది అంతర్వేది దేవస్థానం రథం కన్నా రెండు అడుగులు మాత్రమే చిన్నది.
● రథాన్ని ఎత్తే జాకీకి 2 హెచ్ పీ మోటార్ ఏర్పాటు చేశారు. దీని ఆధారంగా రథాన్ని చుట్టూ తిప్పే వీలుంది. రథం బరువంతా ఈ జాకీ మీద పెట్టినా ఏమీ కాదు.
● రథోత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం ఎనిమిది నుంచి పది గంటల మధ్య ఈ రథాన్ని పంపా సత్రం నుంచి తొలిపావంచా వద్దకు తీసుకువస్తారు. మధ్యాహ్నం రెండు నుంచి 2.30 గంటల వరకు పుష్పాలతో, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేస్తారు. 2.30 నుంచి 3.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు అర్చకస్వాములు అలంకరణ చేస్తారు.
● నాలుగు గంటలకు సత్యదేవుడు, అమ్మవారికి పూజలు చేస్తారు. అనంతరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, వీర్ల సుబ్బారావు కొబ్బరికాయలు కొట్టి రథం ముందు పోసిన కుంభం మీదుగా రథాన్ని లాగి ప్రారంభిస్తారు.
● రథోత్సవంలో భాగంగా సుమారు 200 మంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శిస్తారు.
● రథోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం నుంచి మెయిన్ రోడ్డులో విద్యుత్‌కు అంతరాయం కలుగుతుంది. 36 అడుగుల రథానికి విద్యుత్ తీగలు తగిలే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రథోత్సవం పూర్తయ్యేవరకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.
● అన్నవరం మెయిన్ రోడ్డులో ఉదయం నుంచి వాహనాలను అనుమతించరు. తుని వైపు నుంచి వచ్చే వాహనాలను మండపం వద్ద గల ఆర్చి నుంచి జాతీయ రహదారి వైపు మళ్లిస్తారు. కాకినాడ, రాజమండ్రి వైపు నుంచి వచ్చే వాహనాలను ఎంవీఆర్ సెంటర్ ఆర్చి నుంచి జాతీయ రహదారి వైపు మళ్లిస్తారు.
● సుమారు 500 మంది పోలీసులతో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, సీఐ బి.సూర్య అప్పారావు, మరో పది మంది ఎస్‌ఐలు ఈ బందోబస్తులో పాల్గొంటారు.
● రథోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశాలు జారీ చేశారు.

నేడు సత్యదేవుని రథోత్సవం