
ప్రతి మహిళా శక్తిగా మారాలి
రాజానగరం: మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అనేక చట్టాలు అమలు చేస్తోందని, వాటిపై అవగాహన పెంచుకుని ప్రతి మహిళా స్వీయరక్షణతో ఒక శక్తిలా ఉండాలని శక్తి టీమ్ జిల్లా ఇన్‌చార్జి, డీఎస్పీ కేవీ సత్యనారాయణ అన్నారు. దివాన్ చెరువులోని షిరిడీసాయి జూనియర్ కళాశాలలో శక్తి టీమ్ ఆధ్వర్యంలో శనివారం మహిళా చైతన్య కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి ప్రస్తావిస్తూ స్వీయ రక్షణ చర్యలు, సైబర్ నేరాల అదుపు, సోషల్ మీడియా యాప్స్‌తో వచ్చే నష్టాలు, పోక్సో చట్టం, శక్తి యాప్‌లపై అవగాహన కల్పించారు. మహిళలందరూ శక్తి యాప్‌ను తమ సెల్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ఆ యాప్ ఉపయోగించే విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ కె.మంగాదేవి, ఎౖస్సై రామకృష్ణ, విద్యార్థినులు పాల్గొన్నారు.