
కావాలనే కడ తేర్చారా?
పిఠాపురం: పాపం పుణ్యం తెలియని పసికందును తమకు అడ్డు వస్తుందనే, కావాలనే కడతేర్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పసికందు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఒక పథకం ప్రకారం కొందరు వ్యక్తులు పసికందును హత్య చేసి దానిని తప్పుదోవ పట్టించడానికి క్షుద్ర పూజల నాటకం ఆడినట్టు పోలీసులు గుర్తించారు. ఆ దిశలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే హత్య కేసు చిక్కుముడి విడదీసిన పోలీసులు హత్య ఎందుకు చేశారు? ఎవరు చేశారు? ఎలా చేశారు? అనే విషయాలపై దృష్టి సారించి వాటికి సంబంధించిన క్లూ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. కుటుంబ సభ్యులు ఈ దారుణానికి ఒడిగట్టారనే బలమైన ఆధారాలు సేకరించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒకరితో బంధాన్ని తెంచుకోడానికి మరొకరితో బంధాన్ని కలుపుకోడానికి పేగు బంధాన్ని నిర్దాక్షిణ్యంగా తెంచేసినట్లు పోలీసుల దర్యాప్తు తేటతెల్లమైనట్టు తెలుస్తోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేసినట్లు చెబుతున్నారు.
గుట్టువిప్పిన పసుపు కుంకుమ
పసికందును హత్య చేసిన ఇంట్లో క్షుద్ర పూజలు జరిగిన ఆనవాళ్లు కనిపించడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది. ప్రస్తుత సమాజంలో ఎక్కడా లేని క్షుద్రపూజలు పిఠాపురం పట్టణంలో జనసంచారం ఎక్కువగా ఉండే జగ్గయ్య చెరువులో కలకలం సృష్టించాయి. దీనిపై దృష్టి సారించిన పోలీసులు అసలు క్షుద్ర పూజలు జరిగాయా అన్న విషయంపై ఆరా తీయగా తీగ లాగితే డొంక కదిలినట్లు తెలిసింది. క్షుద్ర పూజలు చేసినట్లుగా ఏర్పాటు చేసిన పసుపు, కుంకుమ, నిమ్మకాయలను పరిశీలించిన పోలీసులు వాటి శాంపిల్ సేకరించి సంఘటన జరిగిన ఇంట్లో ఉన్న పసుపు, కుంకుమతో పోల్చి చూడగా రెండు ఒకటేనని తేలినట్లు సమాచారం. క్షుద్రపూజలు జరిగినట్టు జనాన్ని, పోలీసులను నమ్మించాలని నిందితులు ఏర్పాటు చేసిన పసుపు, కుంకుమ హత్య కేసు చిక్కుముడిని విప్పినట్టు తెలిసింది. కుటుంబ సభ్యులే ఇవి ఏర్పాటు చేశారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు వినికిడి. సాంకేతికత ఆధారంగా వాటిని ల్యాబ్‌కు పంపి నిర్ధారించే పనిలో పోలీసులు ఉన్నట్టు సమాచారం.
అవి క్షుద్ర పూజలు కాదు
పిఠాపురం జగ్గయ్యచెరువు కాలనీలో బాలిక హత్య జరిగిన ఇంట్లో క్షుద్ర పూజలు, చేతబడులు జరగలేదని అది కేవలం ఒక నాటకమని పిఠాపురం సీఐ జి.శ్రీనివాస తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి బుధవారం పోలీసు స్టేషన్‌కు వచ్చి తన మనుమరాలు అయిన ఐదు నెలల పాప కనిపించడం లేదని ఫిర్యాదు చేశారన్నారు. దీంతో పట్టణ ఎస్సై మణికుమార్ తన సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారన్నారు. గాలింపులో ఒక నూతిలో ఐదు నెలల పాప పడి చనిపోయి ఉండడాన్ని గమనించి బయటకు తీశారన్నారు. ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ పర్యవేక్షణలో వెంటనే కేసు నమోదు చేసి, నాలుగు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కేసును తప్పుదోవ పట్టించడానికి క్షుద్రపూజల నాటక మాడినట్లు సాంకేతికత ఆధారంగా గుర్తించామన్నారు. త్వరలోనే పసికందును హతమార్చిన వారిని పట్టుకుంటామని ఆయన తెలిపారు. పిఠాపురం ప్రాంతంలో ఎప్పుడూ క్షుద్ర పూజలు, చేతబడులు వంటివి లేవని, ఇవి కేవలం కల్పితమే కాబట్టి ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.
హత్య కేసును తప్పుదారి పట్టించడానికే క్షుద్రపూజల నాటకం
పసికందు హత్య కేసులో ముమ్మర దర్యాప్తు