
పీజీఆర్‌ఎస్‌కు 176 అర్జీలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ప్రజలు 176 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ పి.ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అలసత్వం ఉండరాదని, అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కార విధానం ఉండాలని అన్నారు. నిర్లక్ష్య వైఖరిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. సమస్య పరిష్కారం కాలేదంటూ ప్రజలు మళ్లీ మళ్లీ తన వద్దకు వస్తే దానిని సంబంధిత అధికారి నిర్లక్ష్యంగా పరిగణిస్తానని స్పష్టం చేశారు. కొన్ని సందర్భాల్లో జిల్లా స్థాయి అధికారుల కంటే సచివాలయ ఉద్యోగులే మెరుగ్గా ఎండార్స్‌మెంట్ ఇస్తున్నారని అన్నారు. సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలన్నారు. కింది స్థాయి ఉద్యోగులు ఎలాంటి పరిష్కారం చూపారో చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందన్నారు. పీజీఆర్‌ఎస్‌కు కొందరు అధికారులు గైర్హాజరవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రం విడిచి వెళ్లాలంటే తప్పనిసరిగా అనుమతి ఉండాలని, ఇక నుంచి అందరూ ఈ–ఆఫీస్ ద్వారా సెలవు వివరాలు తెలియజేసి, ముందస్తు అనుమతి పొందాలని కలెక్టర్ ఆదేశించారు. ఏదైనా అర్జీ పరిష్కరించడం సాధ్యం కాదని తెలిస్తే, అందుకు కారణాలను కూడా వివరించాలని చెప్పారు.
జిల్లాలో 28.8 మిల్లీమీటర్ల
సగటు వర్షపాతం
కొవ్వూరు: జిల్లావ్యాప్తంగా సోమవారం ఉదయం 8.30 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో 28.8 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా తీరం మీదుగా ఉత్తర కోస్తా వరకూ ఉపరితల ఆవర్తనం ఆవరించడంతో కొద్ది రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జిల్లాలో ప్రధానంగా అరటి, కొబ్బరి, మామిడి, జీడిమామిడి, కూరగాయల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరి రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ధాన్యం ఎక్కడికక్కడే కళ్లల్లో, రోడ్ల పక్కన, చేలల్లో ఉండిపోయింది. తేమ శాతం తగ్గించేందుకు పలువురు రైతులు ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టుకుంటున్నారు. ఈ తరుణంలో మారిన వాతావరణ పరిస్థితులు వారికి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా వర్షపాతం వివరాలు.. తాళ్లపూడి గరిష్టంగా 69.6 మిల్లీమీటర్లు. కొవ్వూరు 61.8, దేవరపల్లి 53.2, కోరుకొండ 44.4, గోకవరం 44.2, సీతానగరం 30, నల్లజర్ల 27.6, రాజమహేంద్రవరం అర్బన్ 26.8, చాగల్లు 26.2, బిక్కవోలు 22.4, రంగంపేట 20, గోపాలపురం, రాజమహేంద్రవరం రూరల్ 19.6, రాజానగరం 18.4, అనపర్తి 17.2, ఉండ్రాజవరం 16.2, నిడదవోలు 13.4, పెరవలి 9, కడియం 8.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు అన్నదాతల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నష్టం వాటిల్లిందని, మళ్లీ భారీ వర్షాలు కురిస్తే నష్ట తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని వారు కలత చెందుతున్నారు.
నేడు ముస్లింల చలో రాజమండ్రి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అనేక ముస్లిం వ్యతిరేక చట్టాలు చేస్తోందని ముస్లిం ఐక్యవేదిక నాయకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఉన్న 1995 వక్ఫ్ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ, అభివృద్ధి పేరుతో నల్ల చట్టాన్ని తయారు చేసి, హడావుడిగా ఆమోదించారన్నారు. ప్రతిపక్షాల వాదనలను, ముస్లిం సమాజ అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఈ వక్ఫ్ సవరణ చట్టం అమలు చేయకూడదని, వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ముస్లింలు నిరసనలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా మంగళవారం ‘చలో రాజమండ్రి’ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం ఆజాద్ చౌక్ నుంచి ఉదయం 9 గంటలకు ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరుగుతుందని తెలిపారు