
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రోగులకు నగదు రహిత సేవలందించాలని, నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తే సహించే ప్రసక్తే లేదని కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో ఆమె సమావేశం నిర్వహించారు. వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అమలు విషయంలో కొన్ని ఆస్పత్రులు పరీక్షల పేరిట రోగులను పీడిస్తున్నాయి. ఇటీవల ఈ వ్యవహారంపై ‘సాక్షి’లో కథనం వెలువడింది. ఈనేపథ్యంలో కలెక్టర్ ఆరోగ్యశ్రీ పథకం అమలుపై జిల్లా స్థాయి క్రమశిక్షణ కమిటీతో భేటీ అయ్యారు. అనధికార రుసుము వసూలు చేసిన 11 ఆసుపత్రుల నుంచి రూ.14.22 లక్షల మేర ఆపరాధ రుసుం వసూలు చేయాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. సేవలు అందించే క్రమంలో రోగుల నుంచి అనధికార వసూళ్లు, సేవాలోపం తదితర వాటిపై ఐవీఆర్‌ఎస్ ద్వారా ఫిర్యాదులు అందాయన్నారు. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులు నిర్లక్ష్య వైఖరి వహిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. నగదు వసూలు చేయడం, వైద్య సేవల్లో లోపాలు, స్కానింగ్ ఫీజు వసూలు, రోగిని చేర్చుకోవడానికి తిరస్కరించడం వంటి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఫిర్యాదులు పునరావృతమైతే ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా తమను వివిధ రకాల వసూళ్లతో ఇబ్బంది పెడుతున్నాయంటూ ఆస్పత్రులపై 70 ఫిర్యాదులు వచ్చాయన్నారు. సచివాలయాల ద్వారా 42, ఐవీఆర్‌ఎస్ ద్వారా 28 వచ్చాయన్నారు. ఫిర్యాదులలో ఎక్కువ శాతం మెడికల్ టెస్టులకు సంబంధించినవే. ఒక్క రూపాయి కూడా వసూలు చెయ్యకుండా వైద్య సేవలు అందించేలా ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. సమావేశం సమన్వయ కర్తగా ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ డాక్టర్ పి.ప్రియాంక, డీఎంహెచ్‌వో డాక్టర్ కె.వెంకటేశ్వర రావు, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఎమ్.సనత్ కుమారి, నెట్ వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం, ప్రతినిధులు హాజరయ్యారు.
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల నుంచి అపరాధ రుసుం
వసూలుకు ఆదేశాలు
నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తే
కఠిన చర్యలు
‘సాక్షి’ కథనంపై కదిలిన
యంత్రాంగం


