
గోకవరం జూనియర్ కళాశాలలో చేపడుతున్న అభివృద్ధి పనులు
సాక్షి, రాజమహేంద్రవరం: విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంస్కరణలకు నాంది పలికింది. పేద విద్యార్థి ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకూ అభ్యసించేందుకు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో ప్రోత్సాహం అందిస్తోంది. ఆహ్లాదకర వాతావరణంలో చదువుకునేలా నాడు–నేడు పథకంలో పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగానే జూనియర్ కళాశాలల ఆధునికీకరణ, వసతుల కల్పనపై దృష్టి సారించింది. నాడు–నేడు పరిధిలోకి తీసుకువచ్చి బాగుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందుకు అవసరమైన నిధులు కేటాయించింది. రూ.10.79 కోట్ల అంచనా వ్యయంతో 15 కళాశాలల ఆధునికీకరణ, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. ఇప్పటికే ప్రారంభమైన పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. వెరసి కొన్నేళ్లుగా నిధుల లేమితో కునారిల్లుతున్న కళాశాలలు.. ప్రస్తుతం నిధులతో కళకళలాడుతున్నాయి.
ఎన్నాళ్ల కెన్నాళ్లకు..
ఇంటర్ కళాశాలలపై గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. విద్యా విధానంలో 1968–1972 మధ్య జూనియర్ కళాశాలలు ఏర్పాటయ్యాయి. ప్రారంభ సమయంలో కళాశాల భవనాల్లో చిన్నపాటి మరమ్మతులకు నిధులు విడుదల చేశారు. అనంతరం వాటి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అప్పటి ఇప్పటివరకు పెద్ద సంఖ్యలో ఆధునికీకరణ పనులు జరిగిన సందర్భాలు లేదు. వెరసి కళాశాలల్లో సమస్యలు తిష్ట వేశాయి. భవనాలు శిథిలావస్థకు చేరడం, వసతులు, భవనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందుల మధ్య విద్య కొనసాగించేవారు.
రూపురేఖలు మారేలా..
● ఇంటర్ కళాశాలల్లో విద్యార్థుల కష్టాలు దూరం చేసి ఆహ్లాదకర వాతావరణంలో చదుకునేలా చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
● ఇందులో భాగంగానే నాడు–నేడు కింద భారీ స్థాయిలో నిధులు కేటాయించింది. జూనియర్ కళాశాలల చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం ఇదే తొలి సారి.
● కళాశాలల్లో విద్యార్థులకు అవసరమైన పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అత్యవసరమైన నీటి వసతితో కూడిన మరుగుదొడ్లు నిర్మించనున్నారు.
● సింహభాగం కళాశాల భవనాలకు పైకప్పు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. పెచ్చులూడుతున్న ఫ్లోర్‌ను తొలగించి కొత్తగా తీర్చిదిద్దనున్నారు.
● తాగునీటి ఇబ్బందులు పడకుండా రక్షిత నీరు అందించాలన్న ఉద్దేశంతో ఆర్వో ప్లాంట్లు అందుబాటులో ఉంచుతున్నారు.
● విద్యార్థులు, అధ్యాపకులకు అవసరమైన ఫర్నిచర్ సమకూరుస్తున్నారు.
● అధిక శాతం కాలేజీలకు విద్యుత్ సదుపాయం లేదు. వాటికి పూర్తి స్థాయిలో విద్యుత్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు.
● అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా కళాశాలల చుట్టూ ప్రహరీల నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు.
● క్లాస్ రూమ్‌లలో లైట్లు, ఫ్యాన్లు అమర్చుతున్నారు. భవనాలకు రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
● ఆధునిక హంగులతో కళాశాలల రూపురేఖలు మారనున్నాయి.
పారదర్శకతకు పెద్దపీట
అభివృద్ధి పనుల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. పనుల పర్యవేక్షణ, నిధుల వినియోగంలో రాజకీయాలకు తావులేకుండా చేసింది. కళాశాల స్థాయిలో పార్టీలు, వర్గాలకు అతీతంగా ఎనిమిది మందితో కూడిన ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేసింది. కాలేజీ ప్రిన్సిపల్ కన్వీనర్‌గా ఉండే కమిటీలో ఇంజినీరింగ్ అధికారి, ఇద్దరు లెక్చరర్లు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముగ్గురు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ సభ్యులుగా ఉంటారు. పనుల నాణ్యతపై సభ్యులు సంతృప్తి చెందాకే బ్యాంకుల నుంచి నిధులు డ్రా చేసుకునే వీలుంటుంది.
కళాశాలల వారీగా నిధుల వెచ్చింపు ఇలా..
కళాశాల వ్యయం
అంచనా(రూ.ల్లో)
రాజమహేంద్రవరం 1,47,05,513
కొవ్వూరు(బాలుర) 89,66,718
కొవ్వూరు(బాలికలు) 30,62,595
నిడదవోలు(బాలుర) 1,09,29,600
నిడదవోలు(బాలికల) 78,39,396
చాగల్లు 92,17,177
గోపాలపురం 8,94,781
వేగేశ్వరపురం 38,87,722
ధవళేశ్వరం 79,14,731
మురమండ 68,82,679
యర్నగూడెం 18,45,397
కోరుకొండ 62,02,693
గోకవరం 1,23,56,270
సీతానగరం 67,15,412
రంగంపేట 65,36,884
రూ.10.79 కోట్లతో జూనియర్
కళాశాలల ఆధునికీకరణ
జిల్లా వ్యాప్తంగా
15 కాలేజీలకు అవకాశం
‘నాడు–నేడు’ ద్వారా
అభివృద్ధికి ప్రణాళికలు
త్వరితగతిన పనుల పూర్తికి చర్యలు
నిధుల వినియోగానికి
కమిటీల నియామకం
నాణ్యతకు ప్రాధాన్యం
కళాశాల అభివృద్ధి పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేస్తున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాల్సి ఉన్నా.. ఇంటర్ పరీక్షల కారణంగా కాస్త ఆలస్యమైంది. జిల్లాలోని అన్ని కళాశాలల్లో పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తి స్థాయి లక్ష్యాలను అధిగమిస్తాం. ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లో ప్రతి రూపాయినీ కాలేజీ ఆధునీకరణకే వెచ్చిస్తున్నాం. పనుల్లో పారదర్శకత కోసం కళాశాల ప్రిన్సిపాళ్లతో కమిటీ వేసి పర్యవేక్షణ చేపడుతున్నాం.
– ఐ.శారద, రీజినల్ జాయింట్ డైరెక్టర్, ఇంటర్ బోర్డు

