
కల్యాణోత్సవానికి సిద్ధమైన కొబ్బరి బొండాలు
పెదపూడి: జి.మామిడాడ శ్రీ కోదండ రామాలయంలో గురువారం జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి ప్రత్యేకంగా తయారు చేసిన కొబ్బరి బొండాలు, బియ్యపు గింజలపై మూడు భాషల్లో ‘రామ’ అని రాసిన తలంబ్రాలు సిద్ధమయ్యాయి. జి.మామిడాడకు చెందిన వ్యాయామోపాధ్యాయుడు, సూక్ష్మ కళాకారుడు ద్వారంపూడి యువరాజారెడ్డి, సంధ్య డెకరేషన్స్ అధినేత ద్వారంపూడి సంధ్య వీటిని తయారు చేశారు. కల్యాణ కొబ్బరి బొండాలపై రంగు రంగుల పొడులు, ముత్యాలు, లేసుల సహాయంతో శంఖు, చక్ర, నామాలు, రాముడు, సీత పేర్లను సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే లక్ష బియ్యపు గింజలపై ఎటువంటి సూక్ష్మ పరికరాలూ వినియోగించకుండా పెన్నుతో తెలుగు, ఇంగ్లిషు, హిందీ భాషల్లో ‘రామ’ నామం రాశారు. 14 ఏళ్ల నుంచి 6 లక్షలకు పైగా బియ్యపు గింజలపై మూడు భాషల్లో ‘రామ’నామం రాశానని యువరాజారెడ్డి చెప్పారు.

రామనామాలు రాసిన బియ్యపు గింజలు

రామ నామం రాసిన తలంబ్రాలు