వేములూరు ఉప సర్పంచ్‌ హత్య కేసులో ఇద్దరి అరెస్టు

- - Sakshi

కొవ్వూరు: వేములూరు ఉప సర్పంచ్‌ శీని సత్య వరప్రసాద్‌ను ప్రస్తుతం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఉంటున్న అతని తమ్ముడు సత్యనారాయణే హతమార్చాడని పోలీసులు నిగ్గు తేల్చారు. ఇద్దరి మధ్యా ఆర్థిక పరమైన వివాదాలే ఈ హత్యకు దారి తీసినట్టు వారి విచారణలో నిర్ధారణ అయ్యింది. కొవ్వూరు సబ్‌ డివిజన్‌ పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వీఎస్‌ఎన్‌ వర్మ ఈ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ప్రస్తుతం వేములూరులో ఉన్న ఇంటి దస్తావేజులను అనపర్తికి చెందిన వారికి ప్రసాద్‌, సత్యనారాయణ 2018లో తనఖా పెట్టి, రూ.7.50 లక్షల అప్పు తీసుకున్నారు. అందులో రూ.2 లక్షలు తమ్ముడు సత్యనారాయణకు ఇచ్చి, మిగిలిన సొమ్మును ప్రసాద్‌ తీసుకున్నాడు.

తీసుకున్న డబ్బు కోసం అనపర్తికి చెందిన వ్యక్తి ఒత్తిడి చేయడంతో వేములూరుకు చెందిన ప్రసాద్‌ స్నేహితుడు అక్కిన రాంబాబు (శివరామకృష్ణ) ఆ బాకీ చెల్లించారు. దీనికోసం రూ.4.5 లక్షలు ఇచ్చి, ఇంటిని తనఖా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఈ నేపధ్యంలో ఇంట్లో తన వాటాను పంచాలంటూ ప్రసాద్‌పై సత్యనారాయణ ఒత్తిడి తెస్తున్నారు. తల్లి చనిపోయిన సమయంలో దినకర్మలకు, తీసుకున్న రూ.2 లక్షలకు వడ్డీ, ఇంటికి గోడ కట్టినందుకు, ప్రస్తుత తనఖా బకాయి కలిపి రూ.19.5 లక్షలైందని, ఆ సొమ్ము ఇవ్వాలని సోదరుడికి ప్రసాద్‌ సూచించారు. తాను అంత సొమ్ము ఇవ్వలేనని సత్యనారాయణ చెప్పాడు. ఇంటి వాటా, అప్పు తీర్చే విషయంలో అన్నదమ్ములిద్దరూ 15 రోజులుగా గొడవ పడుతున్నారు. తనకు జంగారెడ్డిగూడెంలో ఉన్న స్థలం అమ్మి, కొంత సొమ్ము ఇస్తానని సత్యనారాయణ చెప్పినప్పుటికీ ప్రసాద్‌ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో అన్నపై తమ్ముడు కక్ష పెంచుకున్నాడు.

ఆదివారం సాయంత్రం కొవ్వూరు చేరుకున్న సత్యనారాయణ వేములూరుకు చెందిన తన మిత్రుడు గెడా శ్రీనుకు ఫోను చేసి, తన వద్దకు రప్పించుకున్నాడు. ఇద్దరూ కలిసి వేములూరు సమీపంలోని ఓ బార్‌లో మద్యం తాగారు. అనంతరం సత్యనారాయణను శ్రీను మోటారు సైకిల్‌పై ఎక్కించుకుని ప్రసాద్‌ ఇంటి వద్ద దింపాడు. ఆ సందర్భంగా అన్నదమ్ములిద్దరి మధ్య ఆర్థిక అంశాలపై మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో ప్రసాద్‌ గొంతు నులిమి, తల గోడకేసి కొట్టి తమ్ముడు సత్యనారాయణ హతమార్చాడు. హత్య జరుగుతున్న సమయంలో గెడా శ్రీను బయట కాపలాగా ఉన్నాడు. ప్రసాద్‌ను హతమార్చిన అనంతరం సత్యనారాయణను శ్రీను మోటారు సైకిల్‌పై తీసుకెళ్లి కొవ్వూరులో విడిచిపెట్టాడు. అక్కడి నుంచి సత్యనారాయణ జంగారెడ్డిగూడెం వెళ్లిపోయాడు.

హతుడు ప్రసాద్‌ భార్య, పిల్లలు చాన్నాళ్లుగా జంగారెడ్డిగూడెంలో ఉంటున్నారు. ప్రసాద్‌ను ఎవరో హత్య చేసినట్టు వేములూరు నుంచి ఫోను ద్వారా సమాచారం రావడంతో ప్రధాన నిందితుడు సత్యనారాయణ ఏమీ తెలియనట్టుగా సోమవారం ఉదయం జంగారెడ్డిగూడెం నుంచి వదిన, అన్న పిల్లలను తీసుకుని వేములూరు వచ్చాడు. కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు అనుమానం రాకుండా ఉండేందుకు సాయంత్రం అన్న అంత్యక్రియలు ముగిసే వరకూ అక్కడే ఉన్నాడు. ఫోన్‌ లొకేషన్‌, సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేశారు.

ప్రధాన నిందితుడు సత్యనారాయణను, అతడికి సహకరించిన శ్రీనును అరెస్టు చేశారు. హత్య చేసిన సమయంలో సత్యనారాయణ చొక్కాపై రక్తపు మరకలయ్యాయి. ఆ చొక్కాతో పాటు నిందితులు ఉపయోగించిన మోటారు సైకిల్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును 24 గంటల్లో ఛేదించిన పట్టణ సీఐ ఏఎల్‌ఎస్‌ రవికుమార్‌, ఎస్సైలు కేవీ రమణ, పి.రవీంద్రబాబు, బి.దుర్గాప్రసాద్‌, ఇతర సిబ్బందిని డీఎస్పీ వర్మ అభినందించారు.

Read latest East Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top