వానలపై అన్నదాత అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

వానలపై అన్నదాత అప్రమత్తం

Mar 19 2023 2:20 AM | Updated on Mar 19 2023 2:20 AM

- - Sakshi

సీతానగరంలో మొక్కజొన్న తడవకుండా బరకాలు కప్పిన రైతులు

సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్‌: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో జిల్లాలో రెండు రోజుల నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఇప్పటికే రైతాంగం అప్రమత్తమైంది. రాజమహేంద్రవరంలో శనివారం ఉదయం జల్లులు పడ్డాయి. రోజంతా వాతావరణం మేఘావృతమై ఉంది. సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. .జిల్లా సగటు 0.2 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. రాజానగరంలో 1.0 మిల్లీ మీటర్లు, బిక్కవోలు, తాళ్లపూడి, ఉండ్రాజవరం, రంగంపేటలో 0.2, గోపాలపురం 1.2, రాజమండ్రి అర్బన్‌ 0.6, కొవ్వూరు 0.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో చిరుజల్లు కురిశాయి.

వర్షాలు తగ్గేవరకూ కోతలు ఆపాలి

కోసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌.మాధవరావు ఓ ప్రకటనలో సూచించారు. జిల్లాలో వరి పంట ప్రస్తుతం గింజ పాలు పోసుకునే దశ నుంచి గింజ గట్టి పడే దశకు చేరుకుందన్నారు. వర్షాలు తగ్గే వరకూ పంట కోతలను ఆపాలన్నారు. వరి ఆర్‌ఎన్‌ఆర్‌ 15,048 రకం 75 కిలోల బస్తా బయట మార్కెట్లో రూ.1,650 పలుకుతుందన్నారు. ఈ రకాన్ని రాజమహేంద్రవరం, రాజానగరం పరిసర ప్రాంతాల్లోని 32,130 ెహెక్టార్లలో సాగు చేశారన్నారు. ఇప్పటి వరకూ రాజమహేంద్రవరం రూరల్‌ మండలంలో 222 హెక్టార్లు, రాజానగరం మండలంలో 45ె హెక్టార్లలో వరి కోతలు జరిగాయన్నారు. మిగతా వరి రకాల్లో ముఖ్యమైన ఎంటీయూ 1,121 రకం కోతలకు ఇంకా సమయం ఉందన్నారు. అధికంగా వర్షాలు పడితే పొలంలో నీటిని కాలువల ద్వారా బయటకు తరలిస్తే పంటకు ఎటువంటి ప్రమాదం ఉండదన్నారు.

3 గ్రామాల్లో పోలాల్లోకి నీరు

కోరుకొండ, గోకవరం మండలాల పరిధిలో కొత్తపల్లి, జగన్నాథపురం, బుచ్చుపేట గ్రామాల్లోని పొలాల్లోకి నీరు చేరింది. కొత్తపల్లిలో రెండు హెక్టార్లలో పొద్దుతిరుగుడు, జగన్నాథపురంలో 5, బుచ్చుపేటలో 15 హెక్టార్లల్లో సెనగ పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా రూపొందించింది. మిగిలిన పంటలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement