ఎరువు.. ధరవు | - | Sakshi
Sakshi News home page

ఎరువు.. ధరవు

May 20 2026 12:17 AM | Updated on May 20 2026 12:17 AM

పెరవలి (కొవ్వూరు): రైతు సంక్షేమమే ధ్యేయం, వారికి అన్ని విధాలా అండగా ఉంటాం అంటూ ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వం అండగా నిలవక, పైగా అదనపు భారం మోపుతోంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కాకముందే ఎరువుల ధరలు 50 కిలోల బస్తాపై రూ.75 నుంచి రూ.350లు పెరగటం రైతుల్లో కలవరం రేపుతోంది. చంద్రబాబు ప్రభుత్వం రైతుల నెత్తిన పెనుభారం మోపి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతోంది. ఈ రెండేళ్ల కాలంలోనే మూడుసార్లు ఎరువుల ధరలు పెరగడం గమనార్హం. ఇప్పటికే కూలీల మొదలు అన్ని ఖర్చులు పెరిగిపోవటం, పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవటంతో రైతులు విలవిల్లాడుతున్నారు.

జిల్లాలో సాగు ఇలా..

జిల్లాలో ఖరీఫ్‌ వరి సాగు విస్తీర్ణం 76,941 హెక్టార్లు. 70 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు ఉన్నాయి. వీటిలో కొబ్బరి 8,050, కోకో 5,517, పామాయిల్‌ 20,219, అరటి 7,500, మామిడి 5,500, మొక్కజొన్న 1,500, కూరగాయలు 4,125 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఇవి కాకుండా పొగాకు, బొప్పాయి, జామ, బత్తాయి, జీడిమామిడి వంటి పంటలు సాగు చేస్తున్నారు.

పెరుగుతున్న వినియోగం

పంటల సాగుకు డీఏపీ, కాంప్లెక్స్‌, సూపర్‌ ఫాస్పేట్‌ ఎరువుల వాడకంతోపాటు పెట్టుబడి కూడా పెరిగింది. ఫలితంగా రైతులకు గిట్టుబాటు కావడం లేదు. ఈ పరిస్థితుల్లో టన్నుపై రూ.వేయి నుంచి రూ.4 వేల వరకు ఎరువుల ధరలు పెరగటం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే సన్న, చిన్న కారు రైతులు ఎరువుల దుకాణాల వద్ద అప్పు పెడుతున్నారు. పంటలు వచ్చిన తరువాత అసలు, వడ్డీతో అప్పు తీర్చవలసి రావటంతో ఆదాయం ఎరువుల దుకాణాల వద్దే సరిపోతోందని వాపోతున్నారు.

నాడు అన్నదాతకు అండదండలు

వైఎస్సార్‌ సీపీ పాలనలో ఒక్కసారి కూడా ఎరువుల ధరలు పెంచలేదు. పైగా పెట్టుబడి సాయం కూడా అందించి రైతులను ఆదుకున్నారు. ప్రకృతి వల్ల పంటలు దెబ్బతింటే రైతులకు పంట కాలంలోనే నష్ట పరిహారం అందించేవారు. ఇవే కాకుండా ఎరువులు, విత్తనాలు అన్ని ఆర్‌బీకేలో అందుబాటులో ఉంచేవారు.

నేడు ప్రభుత్వం విఫలం

2014–19లో అధికారంలో ఉన్న చంద్రబాబు నాలుగుసార్లు ఎరువుల ధరలు పెంచగా, ప్రస్తుత రెండేళ్ల పాలనలోనే మూడుసార్లు పెంచారు. ఈయన పాలనలో తాము పడే పాట్లు వర్ణనాతీతంగా ఉంటాయని, వ్యవసాయాన్ని ఆదుకోనే పనులు చేయటం లేదని రైతులు విమర్శిస్తున్నారు. కేంద్రం నుంచి ఎరువుల కోటాను రప్పించుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఎరువుల కంపెనీలు ధరలు పెంచుకుంటూ పోతున్నా చర్యలు తీసుకోవటం లేదని రైతులు విమర్శిస్తున్నారు.

వ్యవసాయం ఎలా చేయాలి

పెంచిన ఎరువుల ధరల వల్ల ఎకరానికి రూ.4 వేల నుంచి రూ.5 వేలు అదనపు భారం పడుతుంది. వ్యవసాయం ఎలా చేయాలి.

– పిల్లా శ్రీనివాస్‌, రైతు, కొత్తపల్లి అగ్రహారం

50 కిలోల బస్తాపై రూ.75 నుంచి

రూ.350 పెంచిన ప్రభుత్వం

చంద్రబాబు పాలనలో

ఇప్పటికే మూడుసార్లు పెంపు

వైఎస్సార్‌ సీపీ హయాంలో

ఒక్కసారి కూడా పెంచని ప్రభుత్వం

జిల్లాలో వరి సాగు 76,941, ఉద్యాన

పంటలు 70 వేల హెక్టార్లలో సాగు

రైతుకు ఎకరానికి రూ.4 వేల

నుంచి రూ.5 వేల అదనపు భారం

ఎరువుల వివరం పాత కొత్త పెరిగింది

50కిలోల ధర ధర ధర

పొటాష్‌ 1,850 1,975 125

సూపర్‌ ఫాస్పేట్‌ 615 775 160

16–20–13 1,400 1,750 350

20–20–13 1,450 1,800 350

10–26–26 1,950 2,025 75

12–32–16 1,850 1,950 100

16–16–16 1,675 1,950 275

14–35–14 2,150 2,350 200

Advertisement
 
Advertisement
Advertisement