రోస్ట్ రుచే వేరప్పా!
● నోరూరించే మోరి జీడిపప్పు
● బాయిల్డ్ కన్నా మంచి డిమాండ్
● 25 గ్రామాలకు విస్తరించి
25 వేల కుటుంబాలకు ఉపాధి
● రోజుకు 200 బస్తాలు ప్రాసెస్
● ఏటా రూ.500 కోట్ల టర్నోవర్
సఖినేటిపల్లి: జీడిపప్పు తయారీలో కేరళది అగ్రస్థానం. తర్వాతి స్థానం కోనసీమలోని మోరిదే. ఇక్కడి జీడిపప్పు కేరళ సరకు కంటే రుచిగా ఉండడం వల్ల దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కేవలం ఇక్కడ తయారీ విధానం వల్లే దానికి అంత ప్రసిద్ధి ఏర్పడింది. మిగిలిన ప్రాంతాల్లో బాయిలర్‌లో ఉడికించిన జీడిపప్పే దొరుకుతుంది. మోరిలో మాత్రం రోస్టింగ్ పప్పు సరఫరా అవుతుంది.
దిగుమతి గింజలతోనే వ్యాపారం
రెండు శాతం మినహా గింజలు మాత్రం పూర్తిగా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్నవే. గతంలో మోరికే పరిమితమైన ఈ పరిశ్రమ క్రమేపీ ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఉగాదికి అందుబాటులోకి వచ్చే గింజలతోనే సీజన్ మొదలవుతుంది. మోరిలో తయారైన జీడిపప్పు క్రమేణా రాజోలుదీవిలోని సుమారు 25 గ్రామాలకు విస్తరించింది.
రోజుకు 200 బస్తాల గింజలు
రోజుకు సరాసరి 200 బస్తాల గింజల నుంచి జీడిపప్పు ప్రాసెస్ అవుతుంది. 80 కిలోల బస్తాలోని జీడి పిక్కలను ప్రాసెస్ చేస్తే 20 కిలోల స్వచ్ఛమైన జీడిపప్పు వస్తుంది. ఏడాదికి మోరి తదితర ప్రాంతాల్లో తయారయ్యే జీడి పప్పు సుమారుగా 8 నుంచి 9 లక్ష ల టన్నులు ఉత్పత్తి అయ్యి సుమారు రూ.500 కోట్ల టర్నోవర్ వస్తుందని అంచనా. ఈ పరిశ్రమపై 25 వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని అంచనా.
స్వదేశీ గింజలతో వ్యాపారం
ఏటా ఉగాదికి కొత్తగా మార్కెట్‌లోకి వచ్చే స్వదేశీ గింజలతో సీజన్ ప్రారంభమవుతుంది. ఇక్కడి వ్యాపారులు జీడిగింజలను రాజానగరం, మధురపూడి, ఎల్లవరం, పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, గోపాలపురం, దూబచర్ల, కొయ్యలగూడెం నుంచి దిగుమతి చేసుకుంటారు. ప్రాసెస్ చేసిన పప్పును హైదరాబాదు, విజయవాడ, రాజమండ్రి ప్రధాన కేంద్రాలతో పాటు, సమీపంలోని పాలకొల్లు, భీమవరం, నర్సాపురం పట్టణాలకు ఎగుమతి చేస్తుంటారు.
రోస్టింగ్, బాయిలింగ్..
జీడిగింజలను కొలిమి (డ్రమ్ము)లో వేసి కాల్చిన తరువాత పప్పు తీసే పద్ధతి రోస్టింగ్. బాయిలర్ లేదా కుక్కర్‌లో ఉడకబెట్టి పప్పు తీసే పద్ధతి బాయిలింగ్. బాయిలింగ్ పారిశ్రామికంగా పేరుపొందింది. పెద్ద మొత్తంలో వేగంగా, తక్కువ శ్రమతో పప్పు తయారవుతుంది. దీంతో జీడిగింజలు ప్రాసెస్ చేసే అన్ని చోట్లా బాయిలింగ్ పద్ధతి పెరిగింది. మోరిలో కూడా బాయిలింగ్ మొదలైనప్పటికీ, రోస్టింగ్ యూనిట్లే ఎక్కువగా ఉన్నాయి. రోస్టింగ్‌కి నైపుణ్యం ఉన్న కార్మి కులు కావాలి. రోస్టింగ్ చేసే వ్యాపారులు మాత్రం, బాయిలర్ వైరెటీ కంటే రోస్టింగ్ వైరెటీకే ఎక్కువ నిల్వ, నాణ్యత, రుచి ఉంటుందని చెబుతున్నారు.
రోస్టింగ్ జీడిపప్పు స్పెషల్
ప్రస్తుతం రోస్టింగ్ జీడిపప్పు మా ప్రాంతాల నుంచే వస్తోంది. రోస్టింగ్ చేసేది బాగా తెల్లగా ఉండదు. ఉడకబెట్టింది బాగా తెల్లగా ఉంటుంది. బాయిలర్ కంటె రోస్టింగ్‌లో మనుషుల పని ఎక్కువ. రోస్టింగ్ చేసేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
– ముప్పర్తి సుబ్బారావు, వ్యాపారి, మోరిపోడు
శ్రమ ఎక్కువ, లాభం తక్కువ
ఈ పనిలో శ్రమ ఎక్కువ. భారీగా లాభాలేమీ రావు. రైతు వద్ద కొనుగోలు చేసే టైంలో గింజల లోపల ఏముందో పసిగట్టలేం. పెట్టుబడికి, సరుకు అమ్మకం వల్ల వచ్చే మొత్తానికి సరిపోతోంది.
– ముప్పర్తి ఆదినారాయణ, వ్యాపారి, మోరి
80 కేజీల బస్తా రూ.14 వేలు
ప్రస్తుతం మార్కెట్‌లో 80 కిలోల దేశవాళీ బస్తా గింజలు రవాణా చార్జీలతో కలిపి రూ.14 వేలు పలుకుతోంది. 80 కిలోల గింజలను పప్పుగా తయారు చేయడానికి కూలీల ఖర్చు రూ.1,400 వెచ్చించాల్సి వస్తుంది. కాగా స్వదేశీ గింజల్లో లభించే ముడిపప్పు 20 కిలోలను మూడు రకాలుగా గ్రేడింగ్ చేస్తారు. 10 కిలోల గుండు మొదటి రకం, 8 కిలోల ముక్కబద్ద రెండో రకం, 2 కిలోల నలిముక్క మూడో రకం. ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ గుండు ధర రూ.830, కేజీ బద్దముక్క రూ.750, నలిముక్క కేజీ రూ.650 పలుకుతోంది. ఈ ప్రకారంగా గుండుకు రూ.8,300, ముక్కబద్దకు రూ.6,000, నలి ముక్కకు రూ.1,300 లభిస్తోంది. ఇలా చూసుకుంటే ఈ గింజల ద్వారా మొత్తం ఆదాయం రూ.15,600 వస్తోంది.
గిట్టుబాటు స్వల్పమే : మార్కెట్‌లో 80 కిలోల గింజల తయారీలో పప్పుగా మార్చడానికి అయ్యే ఖర్చులతో కలిపి గింజలపై మొత్తం రూ.15,400 పెట్టుబడి అవసరమవుతుంది. మార్కెట్‌లో తెల్లపప్పు విక్రయాల ద్వారా వస్తున్నది రూ.15,600. ఈ రకంగా చూసుకుంటే వ్యాపారికి లాభం అత్యల్పం. ఖాతాలను కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ వ్యాపారం కొనసాగిస్తున్నారు.
రోస్ట్ రుచే వేరప్పా!
రోస్ట్ రుచే వేరప్పా!


