చైతన్య కెరటం చెకుముకి | - | Sakshi
Sakshi News home page

చైతన్య కెరటం చెకుముకి

Dec 21 2025 9:38 AM | Updated on Dec 21 2025 9:38 AM

చైతన్

చైతన్య కెరటం చెకుముకి

రాష్ట్ర స్థాయి సంబరాలకు

కాకినాడ సిద్ధం

మూడోసారి ఆతిథ్యమిస్తున్న ఉమ్మడి జిల్లా

రాష్ట్ర వ్యాప్తంగా 312 మంది హాజరు

శాస్త్రవేత్తలతో 162 మంది

విద్యార్థులు మమేకం

కపిలేశ్వరపురం: మానవుని దైనందిన జీవితంలో సైన్స్‌ భాగం కావాలన్న లక్ష్యంతో జన విజ్ఞాన వేదిక 37 ఏళ్లుగా కృషి చేస్తోంది. విద్యార్థుల్లో విజ్ఞానం, సమాజం పట్ల చైతన్యం కల్పించే దిశగా చెకుముకి సంబరాలను ఏటా నిర్వహిస్తోంది. ఈ ఏడాది రాష్ట్ర స్థాయి సంబరాలను కాకినాడ జేఎన్‌టీయూకేలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కథనం..

విద్యార్థులు ప్రతిభ ఇలా..

అక్టోబర్‌ 18న పాఠశాల స్థాయిలోనూ, నవంబర్‌ 4న మండల స్థాయిలోనూ చెకుముకి పరీక్ష నిర్వహించి మండలానికి ఒక్కో బృందం చొప్పున జిల్లా పోటీలకు ఎంపిక చేశారు. నవంబర్‌ 23న కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో జిల్లా స్థాయి సంబరాలను నిర్వహించారు. వారిలో ప్రథమ స్థానంలో నిలిచిన ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలకు ఒక్కో బృందం చొప్పున ఆదివారం నుంచి రాష్ట్ర స్థాయి సంబరాలకు ఎంపిక చేశారు.

కోనసీమ జిల్లా ప్రభుత్వ విభాగం నుంచి మండపేట రూరల్‌ మండలం ద్వారపూడి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థుల బృందం, ప్రైవేటు విభాగంలో మండపేట పట్టణంలోని అన్నపూర్ణ ఉన్నత పాఠశాల విద్యార్థుల బృందం ప్రథమ స్థానంలో నిలిచాయి. తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ విభాగం నుంచి సీతానగరం మండలం రఘుదేవపురం పీఎంశ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ప్రైవేటు విభాగం నుంచి రాజానగరంలోని శ్రీప్రకాష్‌ విద్యానికేతన్‌ విద్యార్థులు నిలిచారు. కాకినాడ జిల్లా ప్రభుత్వ విభాగం నుంచి పిఠాపురం ఆర్‌ఆర్‌ బీహెచ్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ప్రైవేటు విభాగం నుంచి కాకినాడ గంగరాజునగర్‌లోని ఆదిత్య ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల విద్యార్థుల బృందం ప్రథమ స్థానాల్లో నిలిచాయి. కాకినాడలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి చెకుముకి పోటీల్లో ఆయా బృందాల ప్రాజెక్టులు ప్రదర్శించనున్నారు.

రాష్ట్ర స్థాయి సంబరాలు ప్రత్యేకతలివీ

కాకినాడలోని జేఎన్‌టీయూకేలో మూడు రోజుల పాటు రాష్ట్ర స్థాయి సంబరాలు నిర్వహించనున్నారు. 2015లో జేఎన్‌టీయూకేలోనూ, 2014లో పెద్దాపురం శ్రీప్రకాష్‌ విద్యాలయంలోనూ రాష్ట్ర స్థాయి సంబాలను నిర్వహించారు. ప్రస్తుత సంబరాలకు రాష్ట్రం నలుమూలల నుంచి 54 బృందాలుగా 162 మంది విద్యార్థులు చెకుముకి పరీక్షలో పాల్గొననున్నారు. మరో 150 మంది తల్లిదండ్రులు హాజరుకానున్నారు. ఒక్కో బృందానికి ఒక్కో గైడ్‌ టీచర్‌ హాజరవుతారు. హైదరాబాద్‌ సీసీఎంబీ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ వేగేశ్న రాధ, విశాఖపట్టణం డీఆర్‌డీఓ శాస్త్రవేత్త డాక్టర్‌ యు.అర్బన్‌కుమార్‌, ప్రొఫెసర్‌ రామచంద్రయ్య, ప్రొఫెసర్‌ లక్ష్మారెడ్డిలతో మీట్‌ ది సైంటిస్ట్‌ నిర్వహిస్తారు.

అలాగే విద్యార్థి బృందాలకు రాత పరీక్ష నిర్వహిస్తారు. వ్యక్తిగతంగా కాకుండా విద్యార్థుల బృందంగానే ప్రతిభను పరిగణిస్తారు. ప్రాక్టికల్‌, ఆడియో, వీడియో విజువల్‌ క్విజ్‌ రౌండ్‌ తదితర ప్రతిభా పోటీలను నిర్వహిస్తారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థి బృందాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను ఎంపిక చేస్తారు. విద్యార్థులను క్షేత్ర పరిశీలన విభాగంలో మడ అడవుల సందర్శనకు తీసుకెళ్తారు. తల్లిదండ్రులకు వివిధ సామాజిక అంశాలపై చర్చావేదిక నిర్వహిస్తారు.

జీవితంలో సైన్స్‌ భాగం కావాలి

ప్రజల దైనందిన జీవితంలో సైన్స్‌ భావాలను కల్పించడమే లక్ష్యంగా జనవిజ్ఞాన వేదిక కృషి చేస్తోంది. ఆ లక్ష్యంలో భాగంగా 8, 9, 10 విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, చదువు పట్ల ఆసక్తి, చిన్ననాటి నుంచీ సమానత్వం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి, సమష్టి ఆచరణ పద్ధతులను అలవాటు చేయడానికి కృషి చేస్తున్నాం. కాకినాడలోని రాష్ట్ర స్థాయి సంబరాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం.

జీఎస్‌హెచ్‌పీ వర్మ, ఆహ్వాన సంఘం కార్యదర్శి, కాకినాడ

చెకుముకి సంబరాల నేపథ్యమిదీ

మానవుల్లో అజ్ఞానాన్ని తొలగించేందుకు పలువురు మేధావులు 1988 ఫిబ్రవరి 28న జన విజ్ఞాన వేదికను స్థాపించారు. విద్యార్థి చెకుముఖి పేరుతో 1990 డిసెంబరు నుంచి సైన్స్‌ మాస పత్రికను, 2010 నుంచి ‘చెకుముఖి సైన్స్‌ సంబరాలు’ను నిర్వహిస్తుంది. నేర్చుకున్నది గుర్తుంచుకోవడం కాకుండా ఆచరించగలగడమే గీటురాయి అని చెప్పడమే సంబరాల ఉద్దేశం. వ్యక్తిగా కాకుండా సమూహంగా విజ్ఞాన ప్రదర్శనకు ప్రాధాన్యం ఇస్తుండటం చెకుముకి మరో ప్రత్యేకత.

చైతన్య కెరటం చెకుముకి1
1/1

చైతన్య కెరటం చెకుముకి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement