మంగళసూత్రాలే టార్గెట్
కాకినాడ క్రైం: మహిళల మెడలో మంగళసూత్రాలు లాక్కుని వెళ్తున్న నలుగురు చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్టు చేశారు. మంగళసూత్రాల చోరీలే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఈ నలుగురు రోడ్లపై వెళ్తున్న మహిళల మెడల నుంచి చాకచక్యంగా లాక్కుని వెళ్లడంలో ఆరితేరిపోయారు. వీరి ఆటలను జిల్లా పోలీసులు కట్టించారు. సంబంధిత వివరాలను ఎస్పీ బిందుమాధవ్ శనివారం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన నలుగురు దొంగలు ఇటీవల కాలంలో చైన్ స్నాచింగ్‌లు చేస్తూ బెంబేలు పుట్టిస్తున్నారు. మోటార్ సైకిళ్లపై సంచరిస్తూ రోడ్లపై వెళ్తున్న ఒంటరి మహిళలు, వృద్ధులను లక్ష్యంగా ఎంచుకుంటారు. పరస్పర సమన్వయంతో ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తారు. వరుస దొంగతనాలపై నిఘా పెట్టిన కాకినాడ రూరల్ ఇన్‌స్పెక్టర్ డీఎస్ చైతన్యకృష్ణ తన బృందాన్ని అప్రమత్తం చేశారు. ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు, కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ పర్యవేక్షణలో దొంగల జాడకోసం జల్లెడ పట్టారు. సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయని ఎస్పీ తెలిపారు. కాజులూరు, తాళ్లరేవు, కరప మండలాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతుండగా ఈ బృందాలు ఆయా ప్రాంతాల్లో దొంగల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాయన్నారు. ఎట్టకేలకు దొంగలు తాళ్లరేవు మండలం పరదేశమ్మ పేటకు చెందిన మల్లాడి విజయ్‌కుమార్, సీతారాంపురం కొత్తకాలనీకి చెందిన పెసింగి రాధాకృష్ణ, కాకినాడ జగన్నాథపురానికి చెందిన మల్లాడి సతీష్, తాళ్లరేవు మండలం సీతమ్మపురానికి చెందిన పరంశెట్టి బుజ్జి వెంకట దుర్గారావులను శుక్రవారం సాయంత్రం నామవానిపాలెం మార్గంలో అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. వీరు 24 చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. ముద్దాయిల నుంచి రూ.56 లక్షల విలువైన 452 గ్రాముల బంగారంతో పాటు, ఐదు ద్విచక్ర వాహనాలను, నేరాలకు వినియోగించిన రెండు ద్విచక్రవాహనాలను సీజ్ చేశామన్నారు. దొంగల్ని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఇన్‌స్పెక్టర్ డీఎస్ చైతన్యకృష్ణతో పాటు ఆయన బృందాన్ని ఎస్‌పి ప్రత్యేకంగా అభినందించారు.
● నలుగురు చైన్ స్నాచర్ల అరెస్టు
● రూ.56 లక్షల విలువైన
● 452 గ్రాముల బంగారం రికవరీ


