అగ్నిప్రమాదంలో పూరిళ్లు దగ్ధం
నిరాశ్రయులైన పేద కుటుంబాలు
తొండంగి: మండలంలోని శృంగవృక్షంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించి ఏడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. శృంగవృక్షం గ్రామశివారు పి.అగ్రహారం రహదారిలో సుమారు పది కుటుంబాల వారు ఈ ఇళ్లలో నివసిస్తున్నారు. కొబ్బరి చీపుర్లు, పాములు పట్టడం, ఉడుములు పట్టడం వంటి కుటుంబ వృత్తులతో వారు జీవిస్తుంటారు. శనివారం మధ్యాహ్నం ఓ ఇంటిలో వంట చేస్తుండగా పొయ్యిలోని మంటలు చెలరేగి పై కప్పునకు వ్యాపించాయి. ఈదురుగాలుల ప్రభావంతో మరో ఐదిళ్లకు మంటలు వ్యాపించి క్షణాల్లో అవి కాలిపోయాయి. మగవారు పనికి వెళ్లడంతో ఇళ్లలోని మహిళలు, పిల్లలు కేకలు వేయడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి ఈ లోపు మంటలు ఆర్పేందుకు చేతనైన చర్యలు తీసుకున్నారు. అగ్నిమాపక శకటం వచ్చేటప్పటికే ఆ పూరిళ్లన్నీ కాలిపోయాయి. తోట రమణ, రావూరి శివ, పుట్టం పోలయ్య, తుపాకుల వెంకటలక్ష్మి, బండి సత్తిబాబు, పంజాపు లక్ష్మి, పుట్టం రాజు తదితర కుటుంబాల వారి ఇంటి సామగ్రితో పాటు నగదు కాలిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. సుమారు రూ.పది లక్షల ఆస్తినష్టం ఉంటుందని బాధితులు వాపోయారు. కట్టుబట్టలతో మిగిలిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్ కాంతారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
అట్టహాసంగా టెన్నిస్ టోర్నీ
పెద్దాపురం (సామర్లకోట): సీనియర్ జాతీయ ర్యాంకర్స్ టెన్నిస్ టోర్నమెంట్ శనివారం పెద్దాపురం లిటరరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అట్టహసంగా ప్రారంభమైంది. 35 ప్లస్, 40 ప్లస్, 45 ప్లస్, 50 ప్లస్, 55 ప్లస్, 60 ప్లస్, 65ప్లస్, 70ప్లస్, 70 ప్లస్ విభాగాలలో టెన్నిస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏటా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పోటీలలో భాగంగానే ఈ పోటీలు ఈనెల 23 వరకు జరుగుతాయని చెప్పారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. లిటరరీ అసోసియేషన్ క్లబ్ ఆహ్లాదకరమైన వాతావారణంలో పోటీలు నువ్వా, నేనా అన్నట్టు సింగిల్స్, డబుల్స్ పోటీలు జరిగాయి.
డ్రైవర్ నిర్లక్ష్యం... ప్రయాణికురాలికి గాయం
ప్రత్తిపాడు: ఉచిత బస్సు.. ప్రయాణికుల రద్దీకి తోడు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రయాణికురాలు గాయపడిన ఘటన శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు ఏలేశ్వరం మండల కేంద్రానికి చెందిన బి.దివ్య బంధువు వి.పరిమళతో కలిసి పెద్దాపురం మండలం పులిమేరు వెళ్లేందుకు పయనమయ్యారు. ఏలేశ్వరం నుంచి యర్రవరం వచ్చిన వారిద్దరూ ప్రత్తిపాడు వెళ్లేందుకు రాజమహేంద్రపురం డిపోకు చెందిన తుని వెళ్లే బస్సు ఎక్కుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును కదిలించారు. దీంతో దివ్య అదుపుతప్పి పడిపోయింది. దీనిపై ప్రయాణి కులు డ్రైవర్‌పై ఆగ్రహంతో విరుచుకుపడడంతో అదే బస్సులో ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో తరలించారు. చికిత్స అనంతరం ఆమె స్వగ్రామానికి వెళ్లిపోయింది.
అగ్నిప్రమాదంలో పూరిళ్లు దగ్ధం
అగ్నిప్రమాదంలో పూరిళ్లు దగ్ధం


