మట్టి... కొల్లగొట్టి
● ఆగని మట్టి అక్రమ తవ్వకాలు
● రెచ్చిపోతున్న మాఫియా
కొత్తపేట: నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పలువురు మట్టి వ్యాపారులు ప్రైవేట్ భూముల్లోనే కాదు.. నదీ పరీవాహక ప్రభుత్వ భూముల్లో సైతం మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నా సంబంధిత అధికారులకు మాత్రం పట్టడం లేదనే విమర్శలున్నాయి. కొత్తపల్లి మండలం మందపల్లి, నారాయణలంక, కొత్తపేట సూర్యగుండాల పాయ ప్రాంతాల్లో మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నారు. ఇక్కడ కొందరు నేతల అండదండలతో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఎటువంటి అనుమతులు లేకుండా జేసీబీలతో మట్టి తవ్వి, తరలిస్తున్నారు. రాత్రీ, పగలు అనే తేడా లేకుండా పక్క రోడ్లలోనే కాదు.. నిర్భయంగా ప్రధాన ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారులపై అధికారుల కళ్లముందే ట్రాక్టర్లపై మట్టి తరలిస్తున్నారు. మట్టి తవ్వకాలకు మైనింగ్, రెవెన్యూ అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా వాటిని ఖాతరు చేయడం లేదు. ‘కూటమి’గా ఏర్పడి మట్టి దందా నిర్భయంగా సాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కొంతమంది రైతులు నిబంధనలకు విరుద్ధంగా తమ చేలల్లో మట్టిని లోతుగా తవ్వుకునేందుకు పెద్ద మొత్తానికి విక్రయించగా, పక్క చేలు విరిగిపోతాయని బాధిత రైతులు వాపోతున్నారు. పలు ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని అందిన సమాచారంతో అధికారులు వెళ్లి నిలిపివేస్తున్నా, చర్యలకు పలువురి నేతల నుంచి ఫోన్లు రావడంతో వారు వెనుతిరుగుతున్నారని తెలుస్తోంది. పలుచోట్ల గౌతమి, వశిష్ట నదీ పరీవాహక లంక భూముల్లో ఎక్కువగా ఈ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల గుట్టుచప్పుడు కాకుండా పుంత రోడ్లు, పక్క రోడ్లు వెంబడి తరలిస్తుంటే, కొన్నిచోట్ల ప్రధాన రహదారుల నుంచి తీసుకెళ్తున్నారు.


