పుంజుకున్న పెంపకం | - | Sakshi
Sakshi News home page

పుంజుకున్న పెంపకం

Dec 18 2025 7:31 AM | Updated on Dec 18 2025 7:31 AM

పుంజు

పుంజుకున్న పెంపకం

పుంజుకున్న పెంపకం..

నిడదవోలు: సంక్రాంతి.. ఈ పేరు అంటేనే గోదావరి జిల్లాల్లో కోడి పందేలకు పెట్టింది పేరు. సామాన్యుల నుంచి రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు సైతం పందేలకు సై అంటారు. పండగ సమీపిస్తుండడంతో కోడి పుంజుల వేటలో పందెం రాయుళ్లు ఉంటే, మరోపక్క నిర్వాహకులు మూడు నెలల నుంచి పుంజుల పెంపకంలో నిమగ్నమవుతున్నారు. వీరు పుంజులకు రాజభోగాలతో మేత పెట్టి మరీ పందేలకు సిద్ధం చేస్తున్నారు. పోలీసులు హెచ్చరిస్తున్నా ఏటా బరుల్లో రక్తపుటేరులు పారిస్తున్నారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందేలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పందేలకు అవసరమైన పుంజులను రెడీ చేస్తున్నారు. ఈ సీజన్‌లో పందెం కోళ్లకు మంచి డిమాండ్‌ ఉంది. వీటిపై వ్యాపారం చేసే కొందరు ముందుగా పెంచిన పుంజులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే పందెం రాయుళ్లు పుంజుల వేట మొదలుపెట్టారు. వారికి కావాల్సిన రంగు, సైజుల్లో ఉన్న పుంజులు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుని మరీ కొనుగోలు చేస్తున్నారు. సంక్రాంతి సమీపిస్తుండడంతో పుంజులను కంటికి రెప్పలా చూసుకుంటూ వాటికి అవసరమైన సపర్యలు చేస్తున్నారు. ప్రధానంగా కాకి, డేగ, నెమలి, పరదా, పచ్చకాకి, పెట్టమారు, రసంగి, సేతువా, మైలియా, పింగళ వంటి రకాల పుంజులను పెంచుతున్నారు.

డిమాండ్‌ను బట్టి..

కత్తులు కట్టి బరిలో దింపే పుంజుల ధరలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. కోడి పుంజుల జాతులను పందెం రాయుళ్లు పలు రకాలుగా పిలుస్తారు. రకాన్ని బట్టి ఒక్కో పుంజు రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలుకుతోంది. సరైన పందెం పుంజు దొరికితే ఎంత ధరైనా ముట్టజెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా సేతువా జాతి కోడి మీద పందేలు జోరుగా కాస్తారు. దీని ధర రూ.70 వేల వరకూ పలుకుతోంది. అలాగే వర్లా రకం కోడి ధర రూ. 50 వేలు ఉంది. నెమలి రకం కోడి పుంజు ప్రస్తుతం రూ.50 వేల నుంచి రూ.60 వేలు పలుకుతోంది. కాకి డేగ, పర్లా రూ.25 వేల నుంచి రూ.30 వేలు, ఎర్ర కెక్కిరాయి రూ.40 వేలు, పచ్చకాకి, డేగ రూ.30 వేల నుంచి రూ.40 వేలకు అమ్ముతున్నారు. డిమాండ్‌ను బట్టి పెంపకందారులు ధరను అమాంతం పెంచుకుపోతున్నారు. రసంగి, సేతువా, కెక్కిరాయి, పూల, అబ్రాసు, రసంగి, మైయిలా, సింగాలి, పెట్టమారు, పింగళ వంటి రకాల కోడి పుంజులు రూ.25 వేల నుంచి రూ.30 వేల ధరకు పందెం రాయుళ్లు కొనుక్కుపోతున్నారు.

పౌష్టికాహారం.. ఆపై వ్యాయామం

పుంజులను రోజూ ఈత కొట్టించడంతో పాటు వేడి నీళ్లతో స్నానం చేయించి శక్తివంతమైన పుంజులుగా తయారు చేస్తున్నారు. నవంబర్‌ మాసం నుంచి వీటికి గంట్లు, చోళ్లు, గుడ్లు, పిస్తాలు, బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కిస్మిస్‌, నల్ల నువ్వులు, తాటి బెల్లం, మటన్‌ కై మా, నాస్తా వంటివి ఆహారంగా ఉదయం, సాయంత్రం ఇస్తున్నారు. పౌష్టికాహారం తీసుకున్న పుంజులకు అరుగుదలకు, బద్దకం, నీరసం రాకుండా రోజూ వ్యాయామాలు కూడా చేయిస్తున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా నీటి తొట్టెలను నిర్మించి వాటిలో రోజు ఉదయం ఊత కొట్టిస్తున్నారు. కోళ్ల పెంపకందారులు, పందెం రాయుళ్లు పుంజులకు రాజభోగాలతో మేత పెట్టి మరీ పందెలకు సిద్ధం చేస్తున్నారు. కొందరు అదనంగా విటమిన్‌ ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. ప్రత్యేక ఆహారంతో పెంచుతూ సంక్రాంతి బరిలోకి సిద్ధం చేస్తున్నారు.

అబ్రాసు జాతి

పుంజు

ముహూర్తాలు చూసి మరీ..

సేతువా, పచ్చకాకి, డేగ, కాకి పుంజు, పెట్టమారు వంటి జాతి పుంజులు బరిలో దిగితే నువ్వా.. నేనా అనేలా తలపడతాయి. సేతువా రకం తెల్ల కోడిపుంజు బరిలో ప్రత్యర్థి పుంజును మట్టి కరిపించేందుకు గాయాలతో రక్తం కారుతున్నా లెక్క చేయకుండా కొనఊపిరి వరకూ పోరాడుతుంది. డేగ మీద కూడా ఎక్కువగా పందేలు కడతారు. ఇది కూడా బరిలో పందెం రాయుళ్లకు కాసుల వర్షం కురిపిస్తుంది. కొందరు కోడి పుంజుల జాతి పేర్ల ప్రకారం ముహూర్తాలు చూసుకుని మరీ పందేలు కాస్తారు. కోడి జాతిని బట్టి ఏ దిక్కుకు వెళ్లాలి, ఏ సమయంలో పుంజులను బరిలో దింపాలో ముందుగానే ముహూర్తాలు చూసుకుంటారు.

రూ.కోట్లలో జూదం

సంక్రాంతి పండగ మూడు రోజులూ ఈ కోళ్లతో ఏటా రూ.కోట్ల జూదం జరుగుతోంది. కోనసీమ జిల్లాలో ప్రధానంగా ఐ.పోలవరం మండలం, కాట్రేనికోన, రావులపాలెం, తూర్పుగోదావరి జిల్లాలో నిడదవోలు, గోపాలపురం, నల్లజర్ల, రాజమహేంద్రవరం రూరల్‌, రాజానగరం, కోరుకొండ మండలాల్లో భారీ స్థాయిలో బరులు నిర్వహిస్తారు. నిడదవోలు పట్టణంలో ఫ్లడ్‌ లైట్లు, భారీ ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేసి మరీ పందేలు జరుపుతారు.

పందెం కోళ్లకు రాజభోగాలు

సంక్రాంతి బరిలో దింపేందుకు తర్ఫీదు

రకాన్ని బట్టి రూ.10 వేల నుంచి

రూ.లక్ష వరకూ ధర

పుంజుకున్న పెంపకం 1
1/4

పుంజుకున్న పెంపకం

పుంజుకున్న పెంపకం 2
2/4

పుంజుకున్న పెంపకం

పుంజుకున్న పెంపకం 3
3/4

పుంజుకున్న పెంపకం

పుంజుకున్న పెంపకం 4
4/4

పుంజుకున్న పెంపకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement