డెబిట్ కార్డు ఏమార్చి..
● జల్సాలకు అలవాటు పడి చోరీలు
● పోలీసుల అదుపులోకి నిందితుడు
అనపర్తి: ఏటీఎంల వద్దకు వస్తున్న అమాయక ప్రజలే అతని టార్గెట్.. వారిని మాటల్లోకి దించి, ఆపై డెబిట్ కార్డులు మార్చి చోరీలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని పోలీసులు పట్టుకున్నారు.. మళ్లీ కటకటాల్లోకి పంపారు.. జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న అతన్ని అనపర్తి పోలీసులు మంగళవారం చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై బుధవారం అనపర్తి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్య వివరాలు వెల్లడించారు. నెల్లూరు పట్టణానికి చెందిన కందూకూరు ఫణీంద్ర బీటెక్ చదివాడు. అతను జల్సాలకు అలవాటు పడి చోరీల మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏటీఎంల వద్ద చదువు రాని, వృద్ధులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేయడంలో సహాయం చేసినట్లు నటించి వారి డెబిట్ కార్డును తస్కరిస్తాడు. తన వద్ద ఉన్న డూప్లికేట్ కార్డును వారికిచ్చి, అనంతరం అసలు కార్డు ఉపయోగించి వారి ఖాతాల్లోని సొమ్ము డ్రా చేసి ఉడాయిస్తాడు. ఈ ఏడాది మార్చి నెల 13న అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన సిద్ధాబత్తుల ముత్యాలు అనపర్తి కెనాల్ రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తుండగా, మాటలు కలిపి డెబిట్ కార్డును తస్కరించాడు. అనంతరం ఫణీంద్ర రూ.35 వేలు విత్ డ్రా చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అనపర్తి ఎస్సై ఎల్.శ్రీనునాయక్ దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ తెలిపారు. పలు జిల్లాల్లో నమోదైన 7 కేసుల్లో శిక్ష అనుభవించినా, నిందితుడి ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. 2024 నుంచి తాడేపల్లిగూడెంలో ఉంటూ అనపర్తి, జగ్గంపేట, మండపేట టౌన్, రాజమహేంద్రవరం, అత్తిలి పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ నేరాలకు పాల్పడగా, వచ్చిన సుమారు రూ.1.70 లక్షలతో కారును కొనుగోలు చేసి జల్సా చేస్తున్నాడని డీఎస్పీ వివరించారు. ఫణీంద్ర నుంచి కారు, నేరాలకు ఉపయోగించిన 10 డెబిట్ కార్డులను సీజ్ చేశామన్నారు. సీఐ సుమంత్ ఆధ్వర్యంలో కేసును ఛేదించిన ఎస్సై శ్రీనునాయక్, బృందాన్ని డీఎస్పీ అభినందించారు.


