వెంకన్న హుండీ ఆదాయం రూ.1.56 కోట్లు
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారికి ఆలయ హుండీల ద్వారా రూ.1,56,31,085 ఽఆదాయం వచ్చినట్టు దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. 28 రోజుల అనంతరం బుధవారం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఆలయంలోని హుండీలను తెరిచి, వసంత మండపంలో లెక్కించారు. వేంకటేశ్వరస్వామి ప్రధాన హుండీలు, విశ్వేశ్వరస్వామివారి హుండీల ద్వారా రూ.1,28,07,874, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ.28,23,211 ఽఆదాయం వచ్చినట్టు వివరించారు. అలాగే బంగారం 27 గ్రాములు, వెండి కిలో 150 గ్రాములు, వివిధ దేశాల కరెన్సీ నోట్లు 43 వచ్చాయని ఈఓ తెలిపారు. పర్యవేక్షణ అధికారులుగా దేవదాయ శాఖ ఏసీ, అండ్ అంతర్వేది దేవస్థానం ఈఓ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్, రాజమహేంద్రవరం తనిఖీదారు ఎస్‌టీపీటీ శ్రీనివాస్, వెలిచేరు గ్రూపు దేవాలయాల గ్రేడ్– 3 ఈఓ ఎం.సత్యనారాయణ, అర్చకులు, దేవస్థానం సిబ్బంది, సేవకులు తదితరులు పాల్గొన్నారు.


