మద్దతుకు తేమ కోత
ఆలమూరు: ఈ ఏడాది సంభవించిన ప్రకృతి వైపర్యీతాలకు తోడు చంద్రబాబు సర్కార్ నిర్ణయాల వల్ల ఖరీఫ్ సీజన్‌లో అన్నదాత వెన్ను విరిగింది. వరి పంటకు తెగుళ్ల బెడదకు తోడు వరి పంట చిరుపొట్ట, ఈనిక, వెన్ను దశలో ఉన్న సమయంలో మోంథా తుపాను సంభవించడంతో వరి చేలు నేలకొరిగి వరిగింజ తాలుగా మారిపోయి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. కోత దశకు వచ్చిన వరి చేలు పలు ప్రాంతాల్లో తుపాను ధాటికి వాలిపోయి ధాన్యం రంగు మారిపోయింది. ఈ సమయంలో అండగా ఉండవలసిన ప్రభుత్వం తేమ పేరుతో మద్దతు ధరలో కోత విధిస్తుండగా రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయడం లేదు. మోంథా తుపాను బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్న ప్రభుత్వం ఇప్పటి వరకూ ఏవిధమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడం కాని, ఉచిత పంటల బీమా కింద పరిహారం అందించడం కాని ఇప్పటి వరకూ జరగలేదు. దీంతో ఒకపక్క ప్రభుత్వం నుంచి సాయం అందక, మరోపక్క పంట దిగుబడి తగ్గిపోయి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోంథా తుపాను ప్రభావం వల్ల జిల్లాలో జరిగే నష్టాన్ని అంచనా వేసి నివేదికను రూపొందించేందుకు కేంద్ర బృందం ఆలమూరు మండలంలోని పెనికేరులో పర్యటించింది. నెలలు గడుస్తున్నా ఇంకా తగిన న్యాయం జరగలేదనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది.
గణనీయంగా తగ్గిన ధాన్యం దిగుబడి
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంఽధించి 1.69 ఎకరాల్లో వరి సాగు చేపట్టగా తొలుత 4.35 లక్షల మెట్రిక్ టన్నుల వరకూ దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అయితే ప్రకృతి వైపరీత్యాల వల్ల దిగుబడి 3.16 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయింది. ఎకరాకు 30 నుంచి 35 బస్తాల దిగుబడి వస్తుందని రైతులు అంచనా వేయగా మోంథా తుపాను ప్రభావంతో కేవలం 22 నుంచి 26 బస్తాలకే పరిమితమైంది. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 1.20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి తగ్గిపోగా ఒక్కొక్క రైతు ఎకరాకు సగటున రూ.17 వేల నుంచి రూ.20 వేల వరకూ నష్టపోవాల్సి వచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర ప్రకారం ఈ ఖరీఫ్ సీజన్‌లో సుమారు రూ.750 కోట్ల వరకూ రైతులకు రావాల్సి ఉండగాా తుపాను వల్ల అందులో సుమారు రూ. 280 కోట్ల వరకూ నష్టం వాటిల్లింది.
దళారులు, రైసుమిల్లర్లు కుమ్మకై ్క దోపిడీ
ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో అన్నదాతలు తేమ శాతం పేరిట దోపిడీకి గురవుతున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పెరిగిన ఒక్కొక్క శాతానికి కేజీ చొప్పున ధరను తగ్గించాలి. జిల్లాలో ఉన్న 377 రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం 267 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటి వరకూ కొనుగోలు చేసింది. నిబంధనలు సవరించి షరతులు లేకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరిస్తున్నామని వ్యవసాయశాఖ చెబుతున్నా వాస్తవ పరిస్థితుల్లో దళారుల సహకారంతోనే రైతులు తమ ధాన్యాన్ని రైసుమిల్లర్లకు విక్రయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా రైతులకు క్వింటా కామన్ రకానికి రూ.2,269, ఏ గ్రేడ్ రకానికి రూ.2,289 చొప్పున చెల్లించవలసి ఉంది. ఈ ఏడాది కురిసిన అధిక వర్షాలు, చలి తీవ్రత వల్ల తేమశాతం ప్రభుత్వం నిర్దేశించిన 17 శాతం కంటే అధికంగా 25 శాతం వరకూ ఉంటోంది. తేమశాతం ఒక శాతం పెరిగితే రూ.23.29 రూపాయిలే కోత విఽధించ వలసి ఉండగా దళారులు, రైసుమిల్లర్లు కుమ్మకై ్క రూ.50 నుంచి రూ.80 వరకూ కోతను విధించి తీవ్ర అన్యాయం చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీంతో రైతు బస్తాకు రూ.200 నుంచి రూ.300 వరకూ నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు హమాలీ, రవాణా ఖర్చులను ప్రభుత్వం ఖాతాలకు వేయకముందే దళారులు ముందే రైతుల నుంచి తీసేసుకుంటున్నారు.
కౌలురైతు పరిస్థితి మరింత దయనీయం
కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో భూ యజమానికి సక్రమంగా శిస్తును కట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్ పంటకు సంబంధించి తాను సాగు చేసిన భూమిలో ఎకరాకు 35 బస్తాల వరకూ పండుతాయని భావించిన తరుణంలో దిగుబడి కేవలం 25 బస్తాలకే పరిమితం కావడంతో కౌలురైతుకు తీవ్రనష్టం వాటిల్లింది. రబీ సీజన్‌లో పెట్టుబడికి మరోసారి అప్పులు తేవలసిన దుస్థితి ఉత్పన్నమైంది. ఖరీఫ్ సీజన్‌లో ఏదో విధంగా శిస్తు కొంతమేర చెల్లిస్తే రబీ సీజన్ లాభదాయకంగా ఉంటుందని భావించిన కౌలురైతు ఆశలు అడియాసలయ్యాయి. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలురైతులకు వర్తింపజేస్తామని ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం అనేక అమలు సాధ్యం కాని నిబంధనలు విధించడం శాపంగా మారింది.
ఆలమూరు మండలం చింతలూరులో
తేమ శాతం తగ్గించుకునేందుకు ధాన్యం ఆరబోస్తున్న రైతులు
మండపేట మండలం నల్లూరులో మోంథా తుపాను
ప్రభావంతో నేలకొరిగిన వరి చేను (ఫైల్)
రంగు మారిన ధాన్యం కొనుగోలుకు నో
బస్తాకు రూ.150 నుంచి
రూ.250 వరకూ తగ్గింపు
రూ.280 కోట్ల వరకూ
రైతులకు నష్టం
జిల్లాలో 1.69 లక్షల ఎకరాల్లో వరి సాగు
దిగుబడి లక్ష్యం 4.35 మెట్రిక్ టన్నులు
మద్దతుకు తేమ కోత
మద్దతుకు తేమ కోత


