సహకార సంఘాల ఉద్యోగుల ధర్నా
అమలాపురం టౌన్: తమ డిమాండ్ల సాధన కోసం జిల్లాలోని 166 వ్యవసాయ సహకార సంఘాల సీఈవోలు, ఉద్యోగులు అమలాపురంలోని జిల్లా సహకార అధికారి (డీఎస్‌వో) కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా చేశారు. జీవో నంబర్ 36 ప్రకారం వేతన సవరణ అమలు చేయాలని నినాదాలు చేశారు. చట్ట ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. సంఘాలకు షేరు ధనంపై 6 శాతం వడ్డీ లేదా డివిడెండ్ చెల్లించాలన్నారు. 2019 తర్వాత నియమించిన సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, లాభ నష్టాలతో సంబంధం లేకుండా సంఘాల ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని నినాదాలు చేశారు. సీపీఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా సహకార ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు నూకల బలరామ్ సంఘీభావం తెలిపి ధర్నా శిబిరంలో ప్రసంగించారు. అనంతరం వినతి పత్రాన్ని డీఎస్‌వో ఎ.రాధాకృష్ణారావుకు అందజేశారు. సహకార ఉద్యోగుల రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి పెంకే సత్యనారాయణ, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు యర్రంశెట్టి రామచంద్రరావు, ఉప ప్రధాన కార్యదర్శులు కుంపట్ల అయ్యప్పనాయుడు, మట్టపర్తి జయరామ్, ఉపాధ్యక్షుడు మేడిచర్ల రామలింగేశ్వరరావు, బి.లీలాకృష్ణ ధర్నాకు నాయకత్వం వహించారు.


