అవిశ్రాంత సేవకులు
● సామాజిక బాధ్యతతో ముందుకు..
● హక్కుల కోసం పోరాటం
● నేడు జాతీయ పెన్షనర్స్ డే
కపిలేశ్వరపురం/కొత్తపేట: సమాజంలో శ్రామికులు, ఉద్యోగులు, కీలక పాత్రధారులు. ఉద్యోగ విరమణ తర్వాత వారికి సామాజిక భద్రత కల్పించేందుకు పెన్షన్ ఓ భరోసా. ప్రస్తుత పాలనలో ఆ పెన్షన్ మంజూరు కావాలన్నా, మంజూరైనది పొందాలన్నా ఓ ప్రహసనంగా మారింది. పెన్షనర్లు తమ హక్కుల కోసం పోరాడుతూనే సామాజిక సేవా కార్యక్రమాలను సైతం చేస్తున్నారు. నేడు పెన్షనర్స్ డే సందర్భంగా కథనం..
ఉద్యమ బాటలో...
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఫ్యాక్టరీ, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో సేవలందించిన రిటైర్డ్ పెన్షనర్లు సుమారు 50 వేలు మంది ఉన్నారు. అత్యధికులు రూ.3వేలు లోపు పెన్షన్ తీసుకుంటున్నవారే ఉన్నారు. ఉదాహరణకు ఉమ్మడి జిల్లాలో ఏపీఎస్ ఆర్టీసీ సంస్థలో ఉద్యోగ విరమణ చేసిన వారిలో 1,700 మంది డ్రైవర్లు, కండక్టర్లు, 150 మంది కార్యాలయ ఉద్యోగులు, 1,350 మంది మెకానికల్ విఽభాగానికి చెందిన వారు మొత్తం 3,200 మంది ఉన్నారు. వారు నెలకు కేవలం రూ.2వేల లోపు మాత్రమే పెన్షన్ ఇవ్వడాన్ని నిరసిస్తూ పలుమార్లు ఉమ్మడి జిల్లాలో నిరసన తెలిపారు. వృద్ధులకు అందజేసే రూ.4వేలు సామాజిక పింఛనును వర్తింపజేయాలని కోరుతూ ధర్నాలు చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ సదుపాయం కల్పించాలంటూ సీఐటీయూ తదితర కార్మిక సంఘాలు ఉమ్మడి జిల్లాలో పలుమార్లు ధర్నాలు చేశాయి. ఆల్ ఇండియా కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ సంఘం ఆధ్వర్యంలో ఈపీఎస్ –95 పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.9వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9న ఢిల్లీలోని సుజిత్ భవన్‌లో సదస్సును నిర్వహించారు. 10న జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం ప్రాంతాల నుంచి పెన్షనర్లు తరలివెళ్లారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ వ్యాలిడేషన్ బిల్లు –2025ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు.
ఒకటో తేదీకి అందని పెన్షన్
ఒకటో తేదీకల్లా ఉద్యోగుల జీతాలు, పెన్షన్ చెల్లిస్తామంటూ చంద్రబాబు, పవన్‌కల్యాణ్ 2024 ఎన్నికల ప్రచార సభల్లో ఉపన్యాసాలు ఊదరగొట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్నా పెన్షనర్స్ సమస్యలపై దృష్టి సారించలేదు. ఒకటో తేదీ దాటిన వారం తర్వాతనే చెల్లింపులు చేస్తున్నారు.
సామాజిక సేవలో...
రామచంద్రపురం, మండపేట, అమలాపురం, రాజోలు, కొత్తపేట, రాజమహేంద్రవరం, కాకినాడ తదితర ప్రాంతాల్లో పెన్షనర్లు ప్రణాళికాబద్దంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నెల నెలా పెన్షనర్లకు సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ లబ్ధి రాబట్టేందుకు సంబంధించిన పత్రాలను నింపడం, అధికారులకు నివేదించడం క్రమం తప్పకుండా చేస్తున్నారు. చనిపోయిన తర్వాత ఉద్యోగి ఇంటికి వెళ్ళి పెన్షన్‌కు సంబందించిన ఆన్‌లైన్ ప్రక్రియకు సహకరిస్తున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు. విశ్రాంత ఉద్యోగుల కుటుంబ సభ్యుల చదువు, ఆరోగ్యాలకు తోచిన సాయం చేస్తున్నారు.
సామాజిక పెన్షన్లు వర్తింపజేయాలి
దేశంలో 82 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వారిలో 36 లక్షల మంది రూ.వెయ్యి లోపు, మరో 36 లక్షల మంది రూ.రెండు వేల లోపు పెన్షన్‌ను తీసుకొంటున్నారు. కేవలం 10 లక్షల మంది మాత్రమే రూ.మూడువేలు దాటి పెన్షన్‌ను పొందుతున్నారు. వారందరికీ వృద్ధులు తదితర రకాల సామాజిక పింఛన్లను సైతం అమలు చేయాలి. హైయ్యర్ పెన్షన్ కోసం దేశంలో 17 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 50వేల మందికి న్యాయం జరిగింది. ఈపీఎఫ్ వద్ద రూ.10లక్షల కోట్లు కార్పస్ ఫండ్ ఉండగా దానికి రూ.60వేల కోట్లు నెలకు వడ్డీగా వస్తుంది. అందులోరూ.23 వేల కోట్లు పెన్షన్లుగా చెల్లిస్తున్నారు. మిగిలిన 37వేల కోట్లు తిరిగి ఈపీఎఎఫ్ కార్పస్ ఫండ్‌గా మళ్లిపోతుంది. ఈపీఎఫ్ ఫండ్‌ను షేర్‌మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టడం ప్రమాదకరమైన నిర్ణయం.
– కంచపు సత్తిరాజు,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
ఏపీఆర్‌పీఏ,
కాకినాడ
ఉద్యమాలలో పాల్గొనడానికి మేము యువకులమే
గతంలో పనిచేసిన నాయకుల కృషితో ఇతర సంఘాలకు దీటుగా మా పెన్షనర్ల సంఘం అన్నింటా ముందు ఉంది. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పోరాట కార్యక్రమాలలో పాల్గొనడానికి మా వయసు అడ్డురాదు. ఉద్యమాలలో పాల్గొనడానికి మేము యువకులమే.
– కాశీరాజేంద్ర ప్రసాద్, అధ్యక్షుడు, పూర్వపు కొత్తపేట తాలూకా ప్రభుత్వ పెన్షనర్ల సంఘం
డిమాండ్ల సాధనకు కృషి
సంఘం బలోపేతంలో భాగంగా గత 18 నెలల్లో 361 మందిని నూతన సభ్యులుగా చేర్చాం. మా హయాంలో 61 మందికి అదనపు పెన్షన్ కలిసేలా చేయడం సంతృప్తినిచ్చింది. 2022 ఏప్రిల్ 1 నుంచి ఎరియర్స్ కూడా రావలసి ఉంది. అవి వచ్చేటట్టు చేయడానికి, రాష్ట్ర సంఘం అనుమతితో పోరాట కార్యక్రమానికి ప్రణాళిక తయారు చేస్తున్నాం.
– యేడిద సత్తిరాజు, ప్రధాన కార్యదర్శి, పూర్వపు కొత్తపేట తాలూకా ప్రభుత్వ పెన్షనర్ల సంఘం
మంజూరు కాని కొత్త పింఛన్లు
18 నెలల చంద్రబాబు పాలనా కాలంలో నూతన పింఛన్లు మంజూరు చేయలేదు. దీర్ఘకాలంగా ఇస్తున్న పింఛన్లలో కోత పెట్టారు. కాకినాడ జిల్లాలో 2,71,360 మందికి రూ.117.81 కోట్లు, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2,36,284 మందికి రూ.101.86 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో 2,35,060 మందికి రూ.1.03.27 కోట్లు ఎప్పటి నుంచో ఇస్తూ వస్తున్నారు. 18 నెలల చంద్రబాబు ప్రభుత్వం కొత్తవి మంజూరు చేయకుండా పాత పింఛన్లను సర్వే పేరుతో కోత పెట్టింది. నూతన పింఛన్ కోసం చేసుకున్న దరఖాస్తులు ఉమ్మడి జిల్లాలో సుమారు 30 వేలు, రాష్ట్రంలో 2.5 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గీయులకు 50 ఏళ్ళకే పెన్షన్ మంజూరు చేస్తామన్న హామీని చంద్రబాబు, పవన్ కల్యాణ్ గాలికి వదిలేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, తుని మండలాల్లో ఇంటి పన్నుకు, పింఛన్లకు ముడిపెట్టడం చంద్రబాబు పాలనకే చెల్లింది.
అవిశ్రాంత సేవకులు
అవిశ్రాంత సేవకులు
అవిశ్రాంత సేవకులు


