ఇక బడుల్లో అంగన్‌వాడీ కేంద్రాలు
● కో–లొకేటెడ్ స్కూళ్ల
గుర్తింపునకు సన్నాహాలు
● పైలట్ ప్రాజెక్టుగా
పి.గన్నవరం మండలం
రాయవరం: మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యనభ్యసిస్తారు. ఆరేళ్ల నుంచి 14ఏళ్ల లోపు చిన్నారులు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తారు. ఇప్పుడు పూర్వ ప్రాథమిక విద్య, ప్రాథమిక విద్యను ఒకే గొడుగు కిందకు తెచ్చే ప్రయత్నం విద్యాశాఖ చేపట్టింది. సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేసే ప్రక్రియ దిశగా అడుగులు పడుతున్నాయి. పైలట్ ప్రాజెక్టులో భాగంగా..రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ ఒక్కో జిల్లాలో ఒక్కో మండలాన్ని ఎంపిక చేశారు. దీనికోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పి.గన్నవరం మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు.
కో–లొకేషన్ ప్రక్రియ దిశగా..
మహిళా శిశు అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ(ఐసీడీఎస్), విద్యాశాఖలు సంయుక్తంగా కో–లొకేషన్ ప్రక్రియ చేపడుతున్నాయి. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటుగా, ప్రాథమిక విద్యను సమర్థంగా అందించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశంగా ఉంది. అందులో భాగంగా 200 నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో కలిపి నిర్వహిస్తారు. పాఠశాలలో కనీసం రెండు తరగతి గదులు ఉన్నాయా? లేదా? మరుగుదొడ్లు, తాగునీరు, వంటగది, ఆటస్థలం, స్టోర్ రూమ్, ప్రహరీ, విద్యుద్దీకరణ తదితర వసతులపై పరిశీలన చేస్తారు. మ్యాపింగ్ చేసిన అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తారు. సాధ్యాసాధ్యాల పరిశీలన అనంతరం పూర్వ, ప్రాథమిక విద్యను ఒకే ప్రాంగణంలో అందించే ఏర్పాట్లు చేస్తారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలలో నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులతో చర్చించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే 2023లోనే కోలొకేటెడ్ పాఠశాల ప్రక్రియ చేపట్టారు. అందులో భాగంగా జిల్లాకు ఒక పాఠశాలను ఎంపిక చేశారు. జిల్లాలో కపిలేశ్వరపురం మండలం టేకి బీసీ కాలనీలోని నంబర్ – 1 పాఠశాలను కోలొకేటెడ్ పాఠశాలగా ఎంపిక చేసి, పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు, అంగన్‌వాడీ కార్యకర్తకు శిక్షణ కూడా ఇచ్చారు. ఇప్పుడు మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని కోలొకేషన్ పాఠశాలల ఎంపిక ప్రక్రియను చేపట్టారు.
పి.గన్నవరం మండలంలో పరిస్థితి ఇదీ..
పి.గన్నవరం మండలంలో 84 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మౌలిక వసతులు, భవనాల స్థితిగతులను పరిశీలించేందుకు మండల స్థాయిలో కమిటీని ఏర్పాటు చేశారు. మండల విద్యాశాఖాధికారి చైర్మన్‌గా, సీడీపీవో కో చైర్మన్‌గా, సభ్యులుగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, ఇతర సభ్యులుగా ఉన్న కమిటీ మండలంలో పరిశీలన చేపట్టింది. 12 స్కూళ్లను కోలొకేటెడ్ పాఠశాలలుగా గుర్తించారు.
కో లొకేటెడ్ పాఠశాల
తుది దశలో సర్వే
కో లొకేటెడ్ పాఠశాలల సర్వే తుది దశకు చేరుకుంది. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కో లొకేషన్ నిర్వహిస్తాం. పూర్వ, ప్రాథమిక విద్య ఒకే ప్రాంగణంలో నిర్వహించడం వలన పూర్వ, ప్రాథమిక విద్య బలోపేతమవుతుంది.
– పి.నాగేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
ఇక బడుల్లో అంగన్‌వాడీ కేంద్రాలు


