కర్నూలు బస్సు ప్రమాదం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే
రావులపాలెం: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రైవేటు బస్సు ప్రమాదం ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యే అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. బస్సులో మంటలు చెలరేగి సుమారు 19 మంది చనిపోగా అందులోరావులపాలేనికి చెందిన కొవ్వూరు శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారని చెప్పారు. అతను హైదరాబాదులో క్రేన్ ఆపరేటింగ్ వర్క్ చేస్తూ, పని నిమిత్తం బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ఆయన సోమవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తొలుత రావులపాలెంలోని శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాద ఘటనలో చనిపోయిన వారికి రూ.ఐదు లక్షలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటుందని, కుటుంబానికి రూ 25 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు ప్రైవేట్ బస్సుల యాజమాన్యంతో చేతులు కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, రాత్రి ఒంటిగంట వరకు బెల్ట్ షాపులు నడిపి ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని ఇటువంటి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్పుతారని జగ్గిరెడ్డి అన్నారు.
ప్రజలు అప్రమత్తం కావాలి
కొత్తపేట: మోంథా తుపాను నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు. బంగాళాఖాతంలో మోంథా తుపాను ప్రభావంతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జిల్లా వాసులు అప్రమత్తం కావాలని పేర్కొన్నారు. ముఖ్యంగా తమ వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే రైతులు వారి పొలాల వద్ద ఉన్న విద్యుత్ మోటార్లు, వైర్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని, పాఠశాలలకు సెలవుల కారణంగా పిల్లలు ప్రమాదకరమైన ప్రదేశాలకు, బయటకు వెళ్లకుండా ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని, పూరి గుడిసెల్లో ఉన్న నివాసితులు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. ఉపాధి నిమిత్తం బయటకు వెళ్లేవారు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అప్రమత్తం కావాలని సూచించారు. 1996 నవంబర్‌లో సంభవించిన తుపాను అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అధికారులు ఇచ్చిన కంట్రోల్ రూము నంబరును దగ్గర ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.


