పోలీస్ గ్రీవెన్స్‌కు 5 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఐదు అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా నిర్వహించిన ఈ పోలీస్ గ్రీవెన్స్‌పై తుపాన్ హెచ్చరికలు, ఎడతెరిపి లేని వర్షాల ప్రభావం పడింది. అందుకే కేవలం ఐదు అర్జీలు వచ్చాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తమ ఫిర్యాదు, సమస్య తీవ్రతను బట్టి అయిదుగురు అర్జీదారులు ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఎస్పీ రాహుల్ మీనాకు తమ సమస్యలను తెలుపుకున్నారు.
ఇంటర్ విద్యార్థులకు
పరీక్ష ఫీజు గడువు పెంపు
అమలాపురం టౌన్: ఇంటర్మీడియెట్ చదువుతూ గతంలో పరీక్షలు తప్పిన ప్రథమ, ద్వితీయ విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించే గడువును పెంచినట్లు డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యామండలి ఈ నెల 31వ తేదీ వరకూ గడువు పొడిగించిందని పేర్కొన్నారు. నవంబర్ 1 నుంచి 6వ తేదీ వరకూ రూ.వేయి అపరాధ రుసుముతో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
విఘ్నేశ్వరునికి
పంచ హారతి సమర్పణ
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారికి రాయచూరుకు చెందిన కరుటూరీ వెంకట రామకృష్ణ సోమవారం వెండి పంచ హారతి సమర్పించారు. దీని బరువు ఒక కేజీ 421గ్రాములు ఉంటుందని, దీని విలువ రూ. లక్ష తొంభై వేలని ఆలయ సిబ్బంది తెలిపారు. పంచ హారతిని ఆలయ ప్రధానార్చకుల మాచరి వినాయకరావుకు అందజేశారు. దాతను ఆలయ వేద పండితులు, అర్చకులు వేదాశ్వీర్వాదం పలికి, స్వామి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.
పీహెచ్‌సీల్లో నిరంతర వైద్య సేవలు
అమలాపురం రూరల్: మోంథా తుపాను నేపథ్యంలో జిల్లా పరిధిలోని 47 పీహెచ్‌సీలు, 7 అర్బన్ హెల్త్ సెంటర్లలో 24 గంటలూ వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి నిరంతరం వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ దుర్గరావు దొర సోమవారం ప్రకటనలో తెలిపారు. 92 తుఫాన్ షెల్లర్లు ఏర్పాటు చేసి అత్యవసర మందులు, పాముకాటుకు వ్యాక్సిన్లు, అందుబాటులో ఉంచామన్నారు. కాన్పు తేదీ దగ్గరగా ఉన్న గర్భిణులను వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో చేర్పించామన్నారు. జిల్లావ్యాప్తంగా 2,577 మందితో 432 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 5 అర్జీలు


