కూరగాయల ధరలకు మోంథా రెక్కలు!
● ఒకే రోజు సెంచరీకి చేరువ
చేసిన వ్యాపారులు
● వినియోగదారుల
జేబుకు చిల్లు
ఆలమూరు: మోంథా తుపాను ప్రభావంతో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. వ్యాపారులు ఒకరోజు వ్యవధిలోనే రెండు నుంచి మూడు రెట్లు ధరలు పెంచేయడంపై వినియోగదారులు తీవ్ర ఆసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క తుపాను ప్రభావం, మరోపక్క కూరగాయ ధరలకు రెక్కలు రావడంతో సగటు జీవి జీవనం సాగించడం పెనుభారంగా మారింది. ఇప్పటి వరకూ కిలో రూ.30 లోపు ఉన్న కూరగాయాల ధరలు సోమవారం సెంచరీకి చేరుకున్నాయి. కూరగాయ ధరలు అంతగా పెంచినా రైతుకు మాత్రం హోల్‌సేల్ మార్కెట్‌లో ఏవిధమైన గిట్టుబాటు ధర లభించడం లేదు. రిటైల్ మార్కెట్‌లో దళారులు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు ఈ మొంథా తుపాను వరంగా మారింది. కూరగాయల ధరల మాదిరిగానే తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర తదితర ఆకుకూరల ధరలను వ్యాపారులు ఇష్టారాజ్యంగా పెంచేశారు. కృత్రిమ ఽకొరతను, ధరలను నియంత్రించవలసిన అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని రైతుబజార్లలో పట్టిక మీద ఉన్న ధరలకు వ్యాపారుల విక్రయించే ధరలకు పొంతన లేదని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.
కూరగాయలు రిటైల్ రిటైల్
మార్కెట్ మార్కెట్
పాతధర ప్రస్తుత ధర
కేజీ కేజీ
(రూ.లలో) (రూ.లలో)
ఉల్లి 20 30
మిరపకాయ 40 60
అల్లం 100 150
బంగాళాదుంప 30 60
వంకాయ 40 100
బెండకాయ 50 90
బీట్ రూట్ 30 60
కాలీఫ్లవర్ 20 50
చిక్కుడు 100 120
అరటి కాయ 10 20
దొండకాయ 50 80
టమోటా 30 60
బీరకాయ 60 100
గోరుచిక్కుళ్లు 50 80
ఆనపకాయ 10 25
కాకరకాయ 40 70
కంద 45 70
పెండ్లం 60 90
బీన్స్ 60 90
కీర దోస 30 60
క్యాబేజీ 40 85
ములక్కాడ 08 20
కొత్తిమీర 90 150


