మోంథాకిడి
సాక్షి, అమలాపురం: మోంథా తుపాను దూసుకొస్తోంది. తీరానికి చేరే కొద్దీ బలపడుతోంది. వాయుగుండం ఇప్పటికే తుపానుగా మారగా మంగళవారం సాయంత్రానికి పెను తుపానుగా మారి తీరాన్ని దాట నుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే తుపాను ప్రభావం కోనసీమపై పడింది. సోమవారం ఉదయం సన్నగా మొదలైన వర్షం రాత్రి సమయానికి ఒక మోస్తరుగా మారింది. ఇది మరింతగా పెరిగి అతి భారీగా మారనుంది. మధ్యాహ్నం నుంచి తీరంలో మొదలైన ఈదురుగాలులు సాయంత్రానికి జిల్లా అంతా విస్తరించాయి. మరోవైపు తుపానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
ఈదురు గాలులు.. అతి భారీ వర్షాలు
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి అర్ధరాత్రి మోంథా తుపానుగా మారింది. ఇది మంగళవారం రాత్రికి అతి తుపానుగా మారి ప్రళయంలా కోనసీమపై విరుచుపడనుంది. తుపాను ప్రస్తుతానికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇది తీరం దాటే సమయంలో 90 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీయనున్నాయి. సుమారు 20 సెంటీ మీటర్ల వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా. మంగళవారం తెల్లవారు జాము నుంచి గురువారం సాయంత్రం వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తుపాను ప్రభావం జిల్లాలోని తీర ప్రాంతం మండలాల్లో కనిపిస్తోంది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది నుంచి ఐ.పోలవరం మండలం భైరవపాలెం వరకు సుమారు 90 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. అలలు రెండు,మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. అల్లకల్లోలంగా మారిన సముద్రాన్ని చూసి తీరప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. అంతర్వేది, శంకరగుప్తం, ఓడలరేవు, కొమరగిరిపట్నం, చిర్రయానం వంటి ప్రాంతాలలో సముద్ర అలల ఉధృతి, కోత తీవ్రత పెరిగింది. ఓడలరేవు ఓఎన్జీసీ వశిష్ట టెర్మినల్ ప్రధాన గోడను అలలు తాకుతున్నాయి. సరుగుడు తోటలు సముద్రంలో కలిసిపోతున్నాయి. జిల్లావ్యాప్తంగా సోమవారం సాయంత్రం 4.30 గంటలకు 18.5 మిల్లీమీటర్ల వరకు వర్షం కురవగా, అత్యధికంగా ఉప్పలగుప్తం మండలంలో 40 మిల్లీమీటర్ల వర్షం పడింది.
వేట బంద్
తుపాను ప్రభావానికి సముద్ర వేట నిలిచిపోయింది. ఓడలరేవు, చిర్రయానాం, ఎస్.యానాం, నక్కా రామేశ్వరం, వాసాలతిప్ప, కరవాక, అంతర్వేది వంటి ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు ఇళ్ల వద్దనే ఉన్నారు. వేట బోట్లను గట్ల మీదకు చేర్చి కొట్టుకుపోకుండా రక్షణ చర్యలు చేపట్టారు. మరో వైపు తీర ప్రాంత మండలాల్లోని మత్స్యకారులను తరలిస్తున్నారు. కాట్రేనికోన మండలం నదీపాయల మధ్య ఉన్న మగసానితిప్ప నుంచి స్థానిక మత్స్యకారులను బలుసుతిప్పకు తరలించి పునరావాసం కల్పించారు. లంక గ్రామాల రైతులు తమ పాడి పశువులను మైదాన ప్రాంతాలకు తరలించారు.
ఏర్పాట్లపై ప్రత్యేకాధికారి పరిశీలన
తుపానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల గురించి తుపాను సహాయక చర్యల ప్రత్యేకాధికారి వి.విజయ రామరాజు సోమవారం అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మలికిపురం మండలం కేశనపల్లి సైక్లోన్ సెంటర్‌ను కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్‌తో కలిసి తనిఖీ చేశారు. అంతకుముందు ఆయన కలెక్టరేట్ నుంచి జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన ఎంపీడీవోలు, తహసీల్దార్లు, వివిధ శాఖలకు చెందిన అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను సన్నద్ధతపై సీఎం చంద్రబాబునాయుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు కలెక్టర్ మహేష్ కుమార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 120 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.
ఉదయం నుంచీ ప్రభావం
జిల్లాలో పలుచోట్ల వర్షం
తీర ప్రాంత మండలాల్లో ఈదురు గాలులు
ఒడ్డుకు చేరుకున్న మత్స్యకార బోట్లు
సురక్షిత ప్రాంతాలకు వెళుతున్న జనం
మత్స్యకార గ్రామాలపైనే
జిల్లా యంత్రాంగం దృష్టి
ప్రకృతి వైపరీత్యానికి తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం
డ్రైన్ల నుంచి ముంపు నీరు దిగే
అవకాశం శూన్యం
భారీ వర్షాలు కురిస్తే పంటను
వదిలేసుకోవాలంటున్న రైతులు
అన్నదాత చి‘వరి’ ఆశలపై నీళ్లు
అన్నదాత చివరి ఆశలపై మోంథా తుపాను నీళ్లు చల్లింది. భారీ వర్షంతో వరి చేలల్లో ముంపు మరింత పెరిగింది. జిల్లావ్యాప్తంగా 1.63 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు జరిగిన విషయం తెలిసిందే. పంట చేలు పాలు పోసుకుని గింజ గట్టి పడుతున్న దశలో ఉన్నాయి. గత వారం అల్పపీడన ప్రభావం వల్ల మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు వరిచేలల్లో ముంపునీరు చేరింది. తాజాగా కురుస్తున్న వర్షాలు రైతులను కలవరానికి గురిచేస్తున్నాయి. తీరం దాటే సమయంలో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అదే జరిగితే సాగు మీద ఆశలు వదిలేసుకున్నట్టేనని రైతులు ఆందోళనతో ఉన్నారు.
మోంథాకిడి
మోంథాకిడి
మోంథాకిడి


