టెట్ నోటిఫికేషన్ జారీ
రాయవరం: నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులతో పాటు ఈసారి ఇన్ సర్వీస్ టీచర్లు టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ (టెట్) రాసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్, టెట్ కన్వీనర్ కృష్ణారెడ్డి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో పరీక్షను ఈ ఏడాది డిసెంబరు 10న నిర్వహించనున్నారు. జిల్లాలో 2011కి ముందు నియమితులై ఉద్యోగాలు చేస్తున్న వారు తప్పనిసరిగా టెట్ రాయాల్సి ఉంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు వచ్చే నెల 23 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ మూడు నుంచి హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 150 మార్కుల వంతున రెండు పేపర్లు (టెట్ 1ఏ, టెట్ 2ఏ)ను రాయవచ్చు. కొందరు ఒకటే రాయవచ్చు. డిసెంబర్ 10న ఉదయం 9.30 గంటల నుంచి తొలి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 2న టెట్ కీ విడుదల చేయనున్నారు. తుది కీ జనవరి 13న ప్రకటించిన అనంతరం 19న టెట్ ఫలితాలను ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే టెట్ అర్హత లేని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టెట్‌లో క్వాలిఫై కావాల్సి ఉంది. త్వరలో డీఎస్సీ ప్రకటిస్తామని విద్యాశాఖ రాష్ట్ర స్థాయి అధికారులు ప్రకటించిన నేపథ్యంలో టెట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం జారీ చేసిన టెట్ నోటిఫికేషన్‌లో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులతో పాటు, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 10 వేల మంది వరకూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్‌ను రాయాల్సి ఉంటుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు.
చట్టం అమలు నుంచి..
విద్యాహక్కు చట్టం 2009లో అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత 2012, 2014, 2018, 2025 డీఎస్సీకి సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులంతా టెట్ పరీక్షలైన పేపర్–1, పేపర్–2లో క్వాలిఫై అయిన వారు మాత్రమే డీఎస్సీలో ఎంపికయ్యారు. 2011 డీఎస్సీకి ముందు జరిగిన డీఎస్సీల్లో ఎంపికై న ఉపాధ్యాయులంతా ఉద్యోగంలో కొనసాగడానికి ఇప్పుడు టెట్‌ను ఎదుర్కోవాల్సి ఉంది. ఇది ఒక విధంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు గుదిబండగా మారింది. 2030 ఆగస్టు 31వ తేదీ లోపు ఉద్యోగ విరమణ చేయనున్న ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్, గ్రేడ్–2 హెచ్‌ఎం తదితర క్యాడర్ల ఉపాధ్యాయులు టెట్ పరీక్షకు హాజరు కానవసరం లేదు. అయితే పదోన్నతి పొందాలంటే మాత్రం పేపర్–2 పరీక్ష క్వాలిఫై కావాలి.
వారిలో అయోమయం
టెట్ ప్రకటనపై ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ పరీక్షను ఏ విధంగా ఎదుర్కోవాలన్న సందిగ్ధంలో ఉన్నారు. 1994, 1996, 1998, 2000, 2001, 2002, 2003, 2008 డీఎస్సీ ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ రాయాలి. 2009 విద్యాహక్కు చట్టం ఏర్పడడానికి ముందే డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికై న తాము ఏ విధంగా ఇప్పుడు టెట్‌ను రాయాలని వారు ప్రశ్నిస్తున్నారు. చాలా మంది సీనియర్ ఉపాధ్యాయులు కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షను ఎదుర్కోవడం పెద్ద సవాల్‌గా భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఉపాధ్యాయుల తరఫున సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేయాలని ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే 2009 విద్యాహక్కు చట్టంలో మార్పు తీసుకు వచ్చే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని అంటున్నాయి. ఇప్పటికే జాతీయ స్థాయి ఉపాధ్యాయ సంఘాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేసిన నేపథ్యంలో టెట్‌ను రాయాలా? లేదా? అనే మీమాంసలో ఉపాధ్యాయులు ఉన్నారు.
ఫ డిసెంబరు 10న పరీక్ష
ఫ వచ్చే ఏడాది జనవరి 19న ఫలితాలు
ఫ ఇన్ సర్వీస్ టీచర్ల
పరీక్షపై తొలగని అనిశ్చితి


