భక్తులకు అన్ని వసతులూ కల్పించాలి
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్ధానానికి కార్తికమాసంలో విచ్చేసే భక్తుల కోసం చేసిన ఏర్పాట్లపై దేవదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన శనివారం దేవస్థానంలో వివిధ విభాగాలను పరిశీలించారు. కార్తిక మాసంలోని ఏకాదశి, పౌర్ణిమ వంటి పర్వదినాలలో అధిక సంఖ్య భక్తులు వస్తారని, దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లు కనిపించడం లేదన్నారు. ఈఓ వీర్ల సుబ్బారావు, దేవస్థానం సిబ్బంది మధ్య సమన్వయలోపం కనిపిస్తోందని, అభిప్రాయ భేదాలను పక్కన సమన్వయంతో పనిచేయాలన్నారు. శానిటేషన్ విభాగంలో అదనపు సిబ్బందిని ఇంకా నియమించలేదని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ చెప్పడంతో ఆ విషయంపై కూడా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విష్ణుసదన్ సత్రం ఆవరణలో ఫ్లోరింగ్ అపరిశుభ్రంగా ఉందన్నారు. విష్ణుసత్రంలో వివాహాలు చేసుకున్నాక కల్యాణ మండపాలను అలాగే వదిలేయకూడదని, సంబంధిత కాంట్రాక్టర్‌తో చెప్పి వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు.
సిబ్బందితో సమావేశం
దేవస్థానంలో పరిశీలన అనంతరం సిబ్బందితో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కార్తికమాసంలో శని, ఆది, సోమవారాలతో పాటు దశమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాలలో తెల్లవారుజాము ఒంటి గంట నుంచి, ఇతర రోజుల్లో తెల్లవారుజాము మూడు గంటల నుంచి స్వామివారి వ్రతాల నిర్వహణ, భక్తులకు దర్శనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నవంబర్ 2న జరిగే సత్యదేవుని తెప్పోత్సవం, ఐదున జరిగే సత్యదేవుని గిరి ప్రదక్షణకు భారీగా ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, ఈఈలు నూకరత్నం, రామకృష్ణ, ఏఈఓలు కృష్ణారావు, ఎల్ శ్రీనివాస్ భాస్కర్ పాల్గొన్నారు.
సత్యదేవుని దర్శించిన 40 వేల మంది
కార్తికమాసంలోని తొలి శనివారం సందర్భంగా అన్నవరం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. స్వామివారి వ్రతాలు 2,500 నిర్వహించారు. సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద దీపాలు వెలిగించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది భక్తులకు అన్నదాన పథకంలో భోజనం పెట్టారు. ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు.


