వైఎస్సార్ సీపీ అంగన్‌వాడీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా
సాక్షి, అమలాపురం: వైఎస్సార్ సీపీ అంగన్‌వాడీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పి.గన్నవరానికి అసెంబ్లీకి చెందిన దాసరి మౌనికను నియమించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మౌనికను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
స్పందన ఫైనాన్స్‌లో
రూ.1.44 లక్షల గోల్‌మాల్
అమలాపురం టౌన్: అమలాపురం ఎర్ర వంతెన వద్ద ఉన్న స్పందన ఫైనాన్స్ లిమిటెడ్‌లో ఆరుగురు లోన్ ఆఫీసర్లు రూ. 1.44 లక్షల మేర గోల్‌మాల్ చేశారు. వారిపై కాకినాడ జిల్లా ఏలేశ్వరానికి చెందిన స్పందన ఫైనాన్స్ లిమిటెడ్ మేనేజర్ పలివెల వినోద్‌బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. స్పందన ఫైనాన్స్‌లో లోన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న కాసా కార్తీక్, గెడ్డం కుమార్, దాసరి సిద్ధూప్రకాష్, కోసూరి గోపి, ఉసురుకుర్తి ప్రేమ్‌కుమార్, పెనుమర్తి చిన్నారావులపై కేసు నమోదు చేశామన్నారు. రూ.1.44 లక్షల నిధుల గోల్‌మాల్ 2024 జనవరి నుంచి డిసెంబర్ మధ్య జరిగిందన్నారు. అమలాపురం స్పందన ఫైనాన్స్‌లో ఆడిటర్లు శనివారం నిర్వహించిన ఆడిట్‌లో ఈ అవకతవకలు వెలుగు చూశాయి. దీంతో ఫైనాన్స్ మేనేజర్ వినోద్‌బాబు ఆ ఆరుగురి లోన్ ఆఫీసర్లే సొమ్ము గోల్‌మాల్‌కు కారకులని గుర్తించి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై బి.భావన్నారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ట్రావెల్స్ బస్సులపై
కేసులు నమోదు
అమలాపురం రూరల్: కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు చనిపోయిన సంఘటనతో రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ బస్సులను తనిఖీలు చేస్తున్నారు. జిల్లాలో రెండు రోజులపాటు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 27 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసి, రూ. 97,600 అపరాధ రుసుం విధించామని జిల్లా రవాణా శాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు శనివారం తెలిపారు. భద్రతా ప్రమాణాలు పాటించని మార్నింగ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సును సీజ్ చేసి, ఆ బస్ ఫిట్‌నెస్ రద్దు చేశామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 499 బస్సులపై కేసులు పెట్టి, రూ.20,94,850 అపరాధ రుసుం వసూలు చేశామని తెలిపారు. బస్సుల్లో భద్రతా ప్రమాణాల ఉల్లంఘనను ఉపేక్షించేది లేదన్నారు. తనిఖీల్లో మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్లు రవికుమార్, జ్యోతిసురేష్, ఓలేటి శ్రీనివాస్, రాజేంద్ర ప్రసాద్, లక్ష్మీశ్రీదేవి, షణ్ముఖ శ్రీనివాస్ కౌశిక్ పాల్గొన్నారు.
రసాయన కిట్లతో రేషన్
బియ్యం గుర్తించొచ్చు
అమలాపురం రూరల్: రేషన్ బియాన్ని రసాయన కిట్లతో గుర్తించవచ్చని జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్ తెలిపారు. పేదలకు ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ బియ్యం మాఫియా చేతుల్లోకి వెళ్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయన్నారు. బియ్యం ఎక్కడైనా పట్టుబడితే ప్రజా పంపిణీ వ్యవస్థదా, లేక ప్రైవేట్ మార్కెట్లోదా అనే విషయం గుర్తించేందుకు కొత్త రసాయన కిట్లను ప్రభుత్వం అందించిందన్నారు. అధికారుల అంచనాల ప్రకారం 60 శాతం మంది కార్డుదారులు బియ్యాన్ని దళారులకు అమ్మేస్తున్నారన్నారు. ఇంకా 20 శాతం మంది వలస కూలీలు, తాము పనిచేసే ప్రాంతాల్లోనే బియ్యాన్ని విక్రయిస్తున్నారన్నారు. జిల్లాలోని 8 మంది పౌర సరఫరాల శాఖ ఉప తహసీల్దార్లు, ఇద్దరు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు ఈ కొత్త రసాయన కిట్లు అందించినట్లు తెలిపారు. మరో కిట్ జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉంచామన్నారు. బియ్యాన్ని ఈ కిట్లలోని రెండు రసాయనాలతో పరీక్షిస్తే రేషన్ బియ్యం ఎరుపు రంగులోకి మారుతుందన్నారు. అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే వెంటనే కేసులు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎస్‌ఓ శరత్, అసిస్టెంట్ మేనేజర్ సృజన తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ అంగన్‌వాడీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా


