జిల్లాలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి
అమలాపురం రూరల్: జిల్లాలో టెంపుల్, బీచ్ టూరిజాలకు పర్యాటక హోమ్ స్టే నమూనాలను సేకరించి పైలెట్ ప్రాజెక్టుగా ఒక హోమ్ స్టేను అభివృద్ధి చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సూచించారు. శనివారం అమలాపురం కలెక్టరేట్‌లో జిల్లా పర్యాటక రంగ అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దాలన్నారు. ఐదు ప్రముఖ దేవాలయాలతో టెంపుల్ సర్క్యూట్ టూరిజం నిర్వహణకు ప్యాకేజీ సిద్ధం చేయాలన్నారు. లొల్ల లాకుల వద్ద జనవరి 10, 11 తేదీలలో బోటింగ్ ఫెస్టివల్‌కు ప్రభుత్వ పరంగా రంగం సిద్ధం చేయాలన్నారు. లొల్ల లాకుల వద్ద ఇరిగేషన్ స్థలం, వాడపల్లి దేవాలయం వద్ద ఉన్న దేవదాయ ధర్మదాయ శాఖ స్థలాలను టూరిజం అభివృద్ధికి అప్పగించాలన్నారు. డీఆర్వో మాధవి, ఆర్డీఓ పి.శ్రీకర్, టూరిజం ఆర్‌డీ పవన్, జిల్లా పర్యాటక అధికారి అన్వర్ పాల్గొన్నారు.
ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయండి
జొన్నాడ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. ఈ పనులపై కలెక్టరేట్‌లో జాతీయ రహదారుల అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షించారు. ఫ్లైఓవర్ ఫిల్లింగ్ కోసం సరైన మట్టి లభించక తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు కాంట్రాక్టర్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం విశాఖపట్నం ఎన్టీపీసీ నుంచి అనువైన ఫ్లై యాస్ లక్ష మెట్రిక్ టన్నులు సేకరించేందుకు ఒప్పందం కుదిరిందని, త్వరలో మట్టి ఫిల్లింగ్ పనులు చేపట్టనున్నట్లు కాంట్రాక్టర్ తెలిపారు.


