వనం.. అందులో మనం
ఫ వన సమారాధనలకు వేళాయె
ఫ నేడు కార్తికమాస తొలి ఆదివారం
ఫ సందర్శకులతో కిటకిటలాడనున్న
పర్యాటక ప్రాంతాలు
కొత్తపేట: కార్తిక మాసం వచ్చింది.. ఊరూవాడా సందడి తెచ్చింది.. ఐక్యతను చాటే వన మహోత్సవాలకు వేళయ్యింది.. వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు, స్నేహితులు, వివిధ కుల, కార్మిక, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో వన సమారాధనల జోరు అందుకోనుంది. కార్తిక వన సమారాధనల్లో అంతా ఐక్యంగా ఉసిరి చెట్టు ఉన్న పచ్చని కొబ్బరి, మామిడి తదితర తోటల్లో చేరి, ఆహ్లాదకర వాతావరణంలో సందడి చేసి, మధ్యాహ్నం సహపంక్తి భోజనాలు చేయడం ఆచారంగా వస్తుంది. ఇది సమాజంలో మానవ సంబంధాలు, మత సామరస్యాన్ని పెంపొందించడానికి, ప్రకృతితో మమేకం కావడానికి ఉద్దేశించబడింది. ఇది పిక్నిక్ లాంటిదే కాకుండా, ఉసిరి చెట్టు వద్ద మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేసి, ఆ చెట్టు ద్వారా వీచే గాలి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను అనుభవించడం ముఖ్యోద్దేశం. ప్రస్తుత యాంత్రిక జీవనంలో ఆటవిడుపుగా, మానసికంగా ఉపశమనాన్ని కలిగించే కార్యక్రమంగా ఇది దోహదపడుతుంది. ఈ నెల 26, నవంబరు 2, 9, 16 తేదీల్లో కార్తిక ఆదివారాలు వచ్చాయి. ఆ రోజుల్లో ఎక్కడికక్కడ వన సమారాధనల సందడి కొనసాగనుంది.
ఆనందంగా విహరిద్దాం
కార్తిక మాసంలో ఎక్కువగా ఆదివారాల్లో వన విహారాలు, వన సమారాధనలకు ఏర్పాటు చేసుకుంటారు. కార్తిక మొదటి ఆదివారం (నేడు) కావడంతో పలు వర్గాల వారు వన సమారాధనలు ఏర్పాటు చేసుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అందుకు అనువైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలను సందర్శించి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. కాకినాడ బీచ్, కాకినాడ – తాళ్లరేవు మధ్య కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, రంప, మారుడుమిల్లి అటవీ ప్రాంతాలు, జలపాతాలు, అఖండ గోదావరి నడుమ పాపికొండలు, కొత్తపేట సమీపాన కపిలేశ్వరపురం మండలం వీధివారిలంకలో ధనమ్మతల్లి కొలువైన ధనమ్మమర్రి ప్రాంతం, మందపల్లి – రావులపాలెం మధ్య కాశీరాజుగారి తోట, రాజోలు నియోజకవర్గంలో దిండి రిసార్ట్స్, పి.గన్నవరం అక్విడెక్ట్, బొబ్బర్లంక శివారు పిచ్చుకలంక తదితర ప్రాంతాల్లో వన సమారాధనలు జరుపుకొంటారు.
భక్తి నింపుతూ..
కార్తిక మాసంలో పంచారామాలను దర్శించుకోవడం అత్యంత శ్రేష్టంగా భావిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామ భీమేశ్వరస్వామి, సామర్లకోట కుమారా రామ భీమేశ్వరస్వామి, కోటిపల్లి సోమేశ్వరస్వామి, పిఠాపురం కుక్కటేశ్వరస్వామి, కొత్తపేట మండలం పలివెల కొప్పేశ్వరస్వామి, ముక్తేశ్వరం క్షణముక్తేశ్వస్వామి, మురమళ్ల వీరేశ్వరస్వామి, కుండలేశ్వరం కుండలేశ్వరస్వామి ఆలయాలతో పాటు అన్నవరం సత్యనారాయణస్వామి, ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి, ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి, అయినవిల్లి వరసిద్ధి వినాయకస్వామి, మామిడికుదురు మండలం అప్పనపల్లి బాలబాలాజీ స్వామి, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి, పట్టిసీమ వీరభద్రస్వామి, కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి, ఆలమూరు మండలం జొన్నాడలో విశ్వేశ్వరస్వామి, అంబాజీపేట మండలం వ్యాఘ్రేశ్వరంలో వ్యాఘ్రేశ్వరస్వామి తదితర ఆలయాలున్నాయి. ఈ కార్తికంలో ముఖ్యంగా సోమవారాల్లో ఆయా ఆలయాలను సందర్శిస్తారు. నవంబరు 21 తేదీ మార్గశిర శుద్ధ పాఢ్యమి పుణ్యస్నానాలు, ఆకాశ దీపారాధనతో కార్తికమాసం ముగియనుంది.
పచ్చనిసీమ.. చూద్దామా
గౌతమి – వశిష్ట గోదావరి నడుమ కోనసీమలో పచ్చని పంటలు, కాలువలతో ఆహ్లాదాన్ని పంచే ప్రాంతాలు ఉన్నాయి. ఆత్రేయపురం మండలం లొల్లలాకులు పర్యాటక కేంద్రంగా ఖ్యాతికెక్కింది. పరవళ్లు తొక్కుతూ లొల్ల లాకుల నుంచి విడుదలవుతున్న సాగునీరు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఆ ప్రాంతం కార్తిక మాసంలో పర్యాటకులతో కిటకిటలాడుతోంది. సర్ ఆర్ధర్ కాటన్ మహాశయుడు కోనసీమలో సాగునీటి వ్యవస్థ నిర్వహణకు లాకులను నిర్మించారు. లాకుల గేట్లు ఎత్తే సమయాల్లో వాటి నుంచి ఎగసిపడుతూ ప్రవహించే నీటి కెరటాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి లొల్ల లాకుల వరకు ప్రవహించే ప్రధాన పంట కాలువ లొల్ల లాకుల వద్ద ముక్తేశ్వరం, అమలాపురం, పి.గన్నవరం కాలువలుగా విడిపోతుంది. ఆ మూడు కాలువలకు నీరు వెళ్లే దృశ్యాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. దీంతో జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి లొల్ల లాకుల వద్ద కార్తిక సమారాధనలు జరుపుకొనేందుకు తరలివస్తుంటారు.
అప్రమత్తంగా ఉండండి
గౌతమి, వశిష్ట నదులు, సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు, వన సమారాధనల సందర్భంగా స్నేహితులతో సరదాగా స్నానాలకు దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అక్కడ నిర్లక్ష్యం వహిస్తే రెప్పపాటులో పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా యువత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్లేలా అప్రమత్తంగా ఉండాలి.
సుంకర మురళీమోహన్, డీఎస్పీ, కొత్తపేట
వనం.. అందులో మనం
వనం.. అందులో మనం


