కమీషన్ పెంచకపోతే షాపులు మూసేస్తాం
అమలాపురం టౌన్: ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిన మద్యం షాపులకు మొదట్లో గెజిట్‌లో పేర్కొన్నట్లు 20 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని జిల్లాలోని మద్యం షాపుల యజమానులు డిమాండ్ చేశారు. తమకు 20 శాతం కమీషన్ ఇవ్వకపోతే వ్యాపారాలు చేయలేమని వారు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. అమలాపురం బ్యాంక్ స్ట్రీట్‌లో డీసీసీబీ బ్యాంక్ బ్రాంచ్ కార్యాలయం ఎదురుగా ఉన్న మిడ్ టౌన్ అపార్ట్‌మెంట్స్‌లో మద్యం షాపుల యజమానులు శనివారం సమావేశమయ్యారు. తమకు కమీషన్ పెంచకపోతే షాపులను మూసివేస్తామని వారు హెచ్చరించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న 13.5 శాతం కమీషన్ ఎంత మాత్రం సరిపోవడం లేదని తెగేసి చెప్పారు. జిల్లా వైన్ షాపుల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అత్యవర సమావేశానికి దాదాపు 150 మంది మద్యం షాపుల యజమానులు పాల్గొని ప్రభుత్వానికి తమ అసహనాన్ని, నిరసనను తెలియజేశారు. 2024–26 మద్యం పాటదారులైన లైసెన్స్ షాపుల యజమానులు మూకుమ్మడిగా తమ గళాన్ని అటు జిల్లా ఎకై ్సజ్ అధికారులకు, ఇటు ప్రభుత్వానికి వినిపించారు. అలాగే గెజిట్లో లేని పర్మిట్ రూమ్‌ల కోసం వసూలు చేస్తున్న రూ.7.5 లక్షలను వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రానున్న 15 రోజుల్లో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులను మూసివేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా ఎకై ్సజ్ అధికారులకు జిల్లా వైన్ షాపుల అసోసియేషన్ తరఫున వినతిపత్రం అందించారు. సమావేశంలో జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు, మద్యం షాపుల లైసెన్స్‌దారులు తాడి నరసింహారావు, లింగోలు పెద్ద అబ్బులు, మామిడి గురవయ్య నాయుడు, ఎస్.సుబ్బారెడ్డి, పర్వతనేని బాలయ్య చౌదరి, అప్పారి శ్రీరామమూర్తి, సంసాని గంగాధర్, తాటిపాక అబ్బు, అబ్బిరెడ్డి శ్రీకాంత్, మిద్దె ఆదినారాయణ, వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వానికి మద్యం షాపుల
నిర్వాహకుల అల్టిమేటం


